
కల్లూరు : మండల పరిధిలోని విశ్వనాథపురం ప్రాథమిక పాఠశాలకు తోపుడుబండి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధినేత సాధిక్‌అలీ పాఠశాల నిర్వాహకులకు టీవీని బుధవారం వితరణగా అందజేశారు. నిరుపేద విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్ధులు, అంగన్వాడీ చిన్నారులకు ఉపయోగపడేలా రూ.20వేల విలువైన టీవీని తనవంతు సాయంగా అందించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన నోట్‌పుస్తకాలు, కాపీ పుస్తకాలు, పలకలు, స్కూల్ బ్యాగ్‌లు అందించేందుకు తనవంతు సహకారం అందిస్తానని ప్రకటించారు.
గతంలో తోపుడుబండి ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని గుర్తుచేశారు. ఎంఈవో రాములు మాట్లాడుతూ మండలంలో పలు సేవా కార్యక్రమాల్లో సాధిక్‌అలీ ముందుండి సామాజిక సేవ చేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు సదుపాయాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించి ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం టి.ఉమాదేవి, సీహెచ్.నర్సింహారావు, ఉపాధ్యాయులు సతీష్, రాయల నాగేశ్వరరావు, కొడిశాన విజయ్‌కుమార్, గ్రామపెద్దలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.