రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. రేవంత్ సర్కారు ఏడాది పాలనలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గ్యారెంటీ హామీలను విస్మరించడం, పథకాల్లో కోతలు విధిస్తుండడం వంటి కారణాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సబ్బండ వర్గాల ప్రజలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఆయా వర్గాల ప్రజలు, పలు పార్టీల నేతల, వివిధ సంఘాల నాయకులు ఆందోళన కార్యక్రమలు చేపట్టారు.
-పాల్వంచ/ లక్ష్మీదేవిపల్లి/ జూలూరుపాడు/ వైరా టౌన్, జనవరి 20
Khammam1
విద్యుత్ ఆర్టీజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ కేటీపీఎస్ గేటు ఎదుట, లక్ష్మీదేవిపల్లిలోని విద్యుత్ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్కిల్ కార్యాలయం వద్ద ఆర్టీజన్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీజన్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి 24 వరకూ రిలే దీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ట్రాన్స్కో, జెన్కోల్లో పనిచేస్తున్న 20 వేల మంది ఆర్టీజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యుత్ సరఫరాను స్తంభింపజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే సీపీఐ ఆధ్వర్యంలో జూలూరుపాడులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని; రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
అలాగే, జూలూరుపాడు ఎంఈవో కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేశారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కోడిగుడ్ల బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో వైరా మున్సిపల్ కార్యాలయం వద్ద వందలాదిమంది పేదలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఉపాధి హామీతో సంబంధం లేకుండా పట్టణ పేదలకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలన ప్రారంభించిన ఏడాది దాటినా ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అనంతనరం వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్కు వినతిపత్రం అందించారు.