ఖమ్మం, జూన్ 18: ఖమ్మంలో మంచినీటి సమస్య లేదని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని అందిస్తోందని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా నగరంలోని సోమవారం నిర్వహించిన మంచినీళ్ల పండుగలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు నగరంలో 7 ట్యాంకులు ఉండేవని, గడిచిన రెండు రోజుల్లో 9 కొత్త ట్యాంకులను ప్రారంభించుకున్నామని, జూన్ చివరికల్లా దాదాపు అన్ని ట్యాంకులనూ ప్రారంభిస్తామని తెలిపారు.
కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రులు కేటీఆర్, అజయ్ సహకారంతో నగరంలోని తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. రానున్న 30 ఏళ్ల వరకూ నగరానికి తాగునీటి కొరత ఉండని అన్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్ని మేయర్ అభినందించారు. కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు కర్నాటి కృష్ణ, పడగాల శ్రీవిద్య, పగడాల నాగరాజు, చిరుమామిళ్ల లక్ష్మి, నాగేశ్వరరావు, షేక్ జాన్‌బీ, నాగుల్ మీరా, శీలంశెట్టి రమ, వీరభద్రం, రాపర్తి శరత్కుమర్, దండా జ్యోతిరెడ్డి, రావూరి కరుణ, హుస్సేన్, చామకూరి వెంకటనారాయణ, మక్బుల్, రంజిత్, కృష్ణలాల్, నవీన్, నవ్యజ్యోతి, సతీశ్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. తొలుత నగరంలోని రమణగుట్ట, నరసింహస్వామి దేవాలయం వద్ద నిర్మించిన ఈఎల్ఎస్ఆర్లను మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు.