కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి పిల్లల బువ్వకు కూడా పైసలు చెల్లించలేకపోతున్నది. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టే కార్మికులకు మొండిచేయి చూపిస్తున్నది. గత నాలుగు నెలలుగా వారికి బిల్లులు చెల్లించకుండా ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నది. అధికారంలోకి రాగానే బడుల్లో వంటలు చేసే మహిళలకు నెలకు రూ.10 వేలు జీతం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ వంట బిల్లులు చెల్లించడంలోనూ చతికిలపడుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 1,189 పాఠశాలల్లో ఒక్కో స్కూల్లో ఆరు నుంచి 8 మంది సభ్యులు వంటలు చేస్తున్నారు. తమ జీవితాలను చీకటిమయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా సీఐటీయూ ఆధ్యర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేయగా.. ఆగస్టు నెలలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 31 (నమస్తే తెలంగాణ) : “భద్రాచలం పట్టణంలోని నన్నపునేని స్కూల్లో పిలక శివకుమారితోపాటు మరో ఐదుగురు సభ్యులు వంటలు చేస్తున్నారు. హైస్కూల్లో 200 మందికి పైగా, చిన్న స్కూల్లో 70 మంది విద్యార్థులు ఉంటారు. ఇప్పటివరకు శివకుమారి, సంఘం సభ్యులు బయట రూ.లక్ష వడ్డీకి తెచ్చారు. వడ్డీ పెరుగుతున్నది కానీ వారికి నేటికీ బిల్లులు రాలేదు. అప్పు చేసి మరీ పిల్లలకు వండి పెడుతున్నారు. స్కూల్ వంట మీద ఆధారపడితే కుటుంబం గడవడం కాదు కదా చివరికి అప్పులపాలయ్యే దుస్థితి ఏర్పడింది. ఇది భద్రాచలం స్కూల్లో వంటచేసే మహిళా సభ్యుల దుస్థితి.”
“కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డ హైస్కూల్లో విజయలక్ష్మి అనే మహిళ 8 మందితో కలిసి వంటలు చేస్తున్నది. వీళ్లకు నాలుగు నెలలుగా వంట బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. సరుకులు, కూరగాయలు, గుడ్ల కోసం కిరాణా షాపులో అప్పు చేసి మరీ వండిపెడుతున్నారు. దుకాణం వద్ద లక్షా ఏభై వేల రూపాయల అప్పు కావడంతో సరుకులు ఇవ్వడం లేదు. నెలకు పదివేల జీతం వస్తుందని ఆశపడితే.. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. చివరికి సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు.”
బడిపిల్లల బువ్వకు బిల్లులు ఇవ్వరా?
“కొత్త మెనూ పెడతాం.. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లు తయారుచేస్తాం. మోడల్ స్కూల్స్‌ను అందుబాటులోకి తెస్తాం” అని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు చివరికి మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు మొండిచెయ్యి చూపిస్తున్నది. దీంతో సీఐటీయూ ఆధ్వర్యంలో రెండ్రోజుల క్రితం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గతంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తే కొన్ని నెలలు బిల్లులు ఇచ్చారు.. మళ్లీ పాత పాటే పాడుతున్నట్లు కార్మికులు చెబుతున్నారు.
మార్చి వరకు బిల్లులు చెల్లించాం..
మధ్యాహ్న భోజన కార్మికులకు మార్చి నెల వరకు బిల్లులు చెల్లించాం. కోడిగుడ్ల బిల్లులు కూడాట్రెజరీకి పంపించాం. ఈ-కుబేర్‌లో ఆగినట్లు ఉన్నాయి.. పరిశీలిస్తున్నాం. వారి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. బడ్జెట్ వచ్చిన వెంటనే బిల్లులు పెండింగ్ లేకుండా చేస్తున్నాం. ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నాయి. గ్యాస్ సరఫరా, జీతాలు గురించి అడుగుతున్నారు.
– వెంకటేశ్వరచారి, జిల్లా విద్యాశాఖాధికారి