ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 24: ఖమ్మం జిల్లాలో పండిన మిర్చి పంటకు మంచి డిమాండ్ ఉంది. అత్యంత నాణ్యంగా ఉంటోంది. దీంతో లోకల్, నాన్ లోకల్ ట్రేడర్లు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నాన్ ఏసీ పంట ధర కూడా ఆల్ టైం రికార్డు సృష్టిస్తోంది. తాజాగా రూ.20,800 గరిష్ఠ ధర పలికింది. నాన్ ఏసీ పంటకు సంబంధించి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చరిత్రలో ఇదే అధిక ధర. జిల్లాలో సాగైన తేజా రకం మిర్చి పంట జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో సిరులు కురుస్తున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి మార్కెట్లో ఈ పంట ధరలు జెట్ స్పీడులా దూసుకుపోతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.2 వేలు పెరిగింది. దీంతో మార్కెట్కు పంటను తీసుకొస్తున్న రైతుల ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. శుక్రవారం ఉదయం జెండాపాట సమయానికి మిర్చియార్డుకు ఆయా జిల్లాల నుంచి రైతులు సుమారు 52 వేల బస్తాలను తీసుకొచ్చారు. అనంతరం జరిగిన జెండాపాటలో కొణి
జర్ల మండలం తనికెళ్ల గ్రామానికి చెందిన రైతు జీ.సైదారావు పంటకు క్వింటా గరిష్ఠ ధర రికార్డు స్థాయిలో రూ.20,800 పలికింది. గతంలో ఇదే మార్కెట్లో ఏసీ రకం పంట క్వింటాకు రూ.22 వేలు పలుకగా.. నాన్ ఏసీ రకం పంట క్వింటాకు రూ.19 వేల చొప్పున అధిక ధర పలికింది. సీజన్ ప్రారంభంలో కేవలం రూ.17 వేలు మాత్రమే పలుకగా అనతి కాలంలోనే రూ.20 వేల మార్క్ దాటడం విశేషం.
ఖమ్మం టూ చైనా..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు చేసిన మిర్చి పంటను ఎగుమతిదారులు నేరుగా చెన్నై, కృష్ణపట్నం పోర్టుల ద్వారా చైనా, థాయిలాండ్, వియత్నాం, బంగ్లాదేశ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒకటి రెండు దఫాలు అమెరికాకూ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. తేజా రకం పంట ఎక్కువ మొత్తంలో ఖమ్మం మార్కెట్కు వస్తున్నందున రాష్ట్రంలోని ఇతర మార్కెట్ల ఖరీదుదారులతోపాటు వేరే రాష్ట్రాల వ్యాపారులు సైతం స్థానిక ఖరీదుదారుల సహకారంతో పంటను కొనుగోలు చేస్తున్నారు. స్వయంగా నగరంలోనే ఉండి పంటను కొనుగోలు చేస్తున్నారు. అటు లోకల్, ఇటు నాన్ లోకల్ వ్యాపారులు పోటీ పడుతుండడంతో ధరలు పెరుగుతున్నాయి.
ఇంత ధర పలకడం సంతోషంగా ఉంది..
నేను తెచ్చిన పంటకు మార్కెట్లో అధిక ధర పలకడం సంతోషంగా ఉంది. మలి విడతో ఏరిన 13 బస్తాలను నేను ఈ రోజు మార్కెట్కు తీసుకొచ్చాను. పంట నాణ్యంగా ఉండడంతో నా పంట వద్దే జెండా పాట పెట్టారు. ఈ పంటను కొనేందుకు వ్యాపారులు చాలామంది పాట పాడారు. చివరకు క్వింటాకు రూ.20,800 పలికింది.
–జీ.సైదారావు, మిర్చి రైతు, తనికెళ్ల
ఖరీదుదారులు పోటీ పడుతున్నారు..
మార్కెట్లో మిర్చి పంటను కొనుగోలు చేసేందుకు ఖరీదుదారులు పోటీపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్కు రెండో విడతలో ఏరిన పంట ఎక్కువగా వస్తోంది. నాణ్యత కూడా అధికంగా ఉంటోంది. దీంతో మంచి ధర పలుకుతోంది. దీనికి తోడు ఖమ్మంలో పండిన తేజా రకం పంటకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో చాలా మంది ఆదరణ ఉంది.
–రుద్రాక్ష మల్లేశం, మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి, ఖమ్మం