ఖమ్మం, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఉచిత చేపపిల్లల పంపిణీ’ పథకంపై నీలినీడలు అలుముకున్నాయి. పథకాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. జలాశయాల్లో చేపపిల్లలను వేయాల్సిన సమయం మించిపోతున్నా ఆ ఊసే ఎత్తకపోవడం మత్స్యకారులను అయోమయానికి గురిచేస్తున్నది. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకానికి మంగళం పాడినట్లేనని స్పష్టమవుతుండగా, చేపలు పట్టే బెస్త, ముదిరాజ్ కుటుంబాలు ఉపాధి కోల్పోయే దుస్థితి దాపురించింది.
చేపల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ఆర్థిక చేయూతను అందించాలనే ఉద్దేశంతో గత కేసీఆర్ సర్కార్ ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలను వదిలే ప్రక్రియను ప్రారంభించింది. 2016లో పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ ప్రతి ఏడాది ఏప్రిల్ నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వర్షాలు మొదలయ్యే సమయానికి చెరువుల్లో చేపపిల్లల పంపిణీని చేపట్టేవారు.
చివరిసారిగా 8వ విడత చేపపిల్లల అభివృద్ధి కార్యక్రమం 2023-24లో జరిగింది. ప్రతి ఏటా ఈ కార్యక్రమం ఎంతో సంబురంగా జరుగుతూ ఉండేది. చేపపిల్లలను వదిలే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీ బాధ్యుల సమక్షంలో సైజులు, చేపపిల్లల నాణ్యతను నిర్ధారించిన తరువాతనే చెరువుల్లోకి చేపపిల్లలను వదిలి పెట్టేవారు. తద్వారా పారదర్శకంగా కేసీఆర్ సర్కారు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఊసే కరువైంది. అదును దాటిపోతోందని మత్స్య సహకార సంఘాలు అధికారులను కలిసి మొత్తుకుంటున్నా ఫలితం లేకుండాపోయింది. ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ను కలిసినా ఎలాంటి స్పందన కనిపించడం లేదు.
గతంలో ప్రతి సంవత్సరం వానకాలం ప్రారంభంకాకముందే చేపపిల్లల పంపిణీ కోసం ఏర్పాట్లు జరిగేవి. జూన్ ప్రారంభంలోనే టెండర్లను ఆహ్వానించి ఫైనల్ చేసేవారు. టెండరు ప్రక్రియ పూర్తికాగానే చెరువుల్లోకి సీడ్‌ను వదిలేవారు. అయితే ఈ ఏడాది మాత్రం కాంగ్రెస్ సర్కారు ఇప్పటికీ పథకంపై దృష్టి సారించనట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు కనీసం టెండరు ప్రక్రియనూ ప్రారంభించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతా లేదు. అసలు చేపపిల్లల పంపిణీ ఉంటుందా.. లేదా.. అనే క్లారిటీ కూడా లేకపోయింది. కొన్నిచోట్ల చేపపిల్లల పంపిణీకి బదులుగా నగదు అందించాలనే డిమాండ్లు మత్స్య సహకార సొసైటీల నుంచి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. అయితే సెప్టెంబర్ వరకు సీడ్ వేస్తేనే మంచి ఎదుగుదల వస్తుందని, ఆలస్యమైతే చేపల ఎదుగుదలపై ప్రభావం పడుతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలో 880 వేల చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఏటా 3.70 కోట్లకుపైగా చేపపిల్లలను వదులుతూ వస్తున్నారు. అవి పెరిగి పెద్దయ్యాక వాటిని విక్రయించి వేలాది మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 220 మత్స్యకార సంఘాలు ఉన్నాయి. వాటిలో 16 వేల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా చేపల విక్రయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి అడిగినా ఫలితం లేకపోయింది. జిల్లాలో ప్రతి ఏడాది అదునుదాటిన తరువాత చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారు. వాటిలో ప్రధానంగా బొచ్చ, రవ్వు, మోస్, బంగారు తీగలను వదులుతున్నారు. కానీ, సరైన సమయంలో వదలకపోవడంతో చేపపిల్లలు ఎదగడం లేదు. దీంతో తమకు మేలు జరగడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. ఆగస్టులోపు చెరువుల్లో చేపపిల్లలను వదిలితే బాగా ఎదుగుతాయని, అలాంటిది సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు పంపిణీ చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. అంతేకాక కాంట్రాక్టర్లు సైతం నాసిరకం చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారని, దీంతో అవి ఆశించిన మేర ఎదగడం లేదని ఆరోపిస్తున్నారు.