చుంచుపల్లి, జనవరి 4: చుంచుపల్లి మండలం గాంధీకాలనీలో నివాసం ఉంటున్న కొమ్మరబోయిన శ్రీనివాస్ గత నెల 30న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కొద్దిరోజుల్లోనే కేసును ఛేదించారు. హత్యకేసులో మృతుడి భార్యే నిందితురాలు అని నిర్ధారించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సీఐ రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రెవెన్యూశాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు 29 ఏళ్ల క్రితం సీతామహాలక్ష్మితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సాయికుమార్, భవాని. భర్త కొన్నేళ్ల నుంచి మద్యానికి బనిసయ్యాడు.
ఈవిషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరిగేవి. భర్త అడ్డు తొలగితే ఉద్యోగం తనకు వస్తుందని భావించిన భార్య అవకాశం కోసం ఎదురుచూస్తున్నది. భర్తను చంపాలని ముందుగానే ఒక కర్రను ఇంట్లో దాచిపెట్టింది. ఈ క్రమంలో 30న ఇంటికి భర్త తాగి వచ్చాడు. నిద్రపోతున్న భర్తపై కర్రతో దాడి చేసి గాయపరిచింది. తర్వాత తన మీద ఎవరికీ అనుమానం రాకుండా తన భర్త కాలుజారి కిందపడ్డాడడని స్నేహితులకు ఫోన్ ద్వారా తెలిపింది. ఇంటి యజమానికి ఇదే చెప్పింది. అనంతరం ఆటోలో భర్తను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించింది. భర్త అసలు విషయం బయట చెప్తాడని భయపడి అక్కడి నుంచి పరారైంది. ఎలాగైనా హైదరాబాద్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నది. బుధవారం కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిందితురాలని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.