ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 3 : ఉపాధ్యాయులు రిపోర్టు చేసేందుకు అనువుగా సిబ్బందిని కేటాయించకపోవడం.. మధ్యాహ్నం వరకు మూల్యాంకనం చేసేందుకు సమాధాన పత్రాలు ఇవ్వకపోవడంతో బుధవారం ఉదయమే టెన్త్ స్పాట్లో పాల్గొనేందుకు నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మూల్యాంకనం చేసేందుకు సమాధాన పత్రాలు ఇవ్వకపోవడంతో ఆపసోపాలు పడ్డారు. ఎట్టకేలకు మధ్యాహ్నం భోజనం తర్వాత స్పాట్ షురూ అయ్యింది.
సీఈ, ఏఈలతోపాటు కీలకమైన స్పెషల్ అసిస్టెంట్లలో 135 మందికిపైగా మూల్యాంకనం ప్రక్రియకు గైర్హాజరయ్యారు. 200 మందికిపైగా విధులు కేటాయించగా.. కేవలం 70 మంది మాత్రమే రిపోర్ట్ చేశారు. దీనిపై ఆగ్ర హం వ్యక్తం చేసిన డీఈవో సోమశేఖర శర్మ వెంటనే 135 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గురువారం స్పాట్లో విధులకు రిపోర్ట్ చేయాలని, లేదం టే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సిబ్బంది షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. స్పెషల్ అసిస్టెంట్ల కొరతను అధిగమించేందుకు కేజీబీవీలకు చెందిన సీఆర్టీలతోపాటు డైట్లో డీఈడీ చదువుతున్న 40 మంది విద్యార్థులను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
జిల్లాకు అత్యధికంగా ఇంగ్లిష్ పేపర్లు కేటాయించడంతో అసిస్టెంట్ ఎగ్జామినర్స్(ఏఈ) కొరత ఏర్పడింది. 130 మంది విధులకు రిపోర్ట్ చేయగా.. మరో 25 మంది అవసరముంది. ఈ క్రమంలో ఆసక్తి ఉన్న ఖమ్మం జిల్లాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు ఆర్డర్లు ఇవ్వనున్నట్లు డీఈవో పేర్కొన్నారు. హిందీలో మరో 10 మంది ఏఈల కొరత ఉంది. కాగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను అర్బన్ ఎంఈవో శ్రీనివాస్ పర్యవేక్షించారు. మండలాలవారీగా సిబ్బందితో సబ్జెక్ట్‌ల వారీగా రిపోర్ట్ చేయించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయులు రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే స్పాట్ డ్యూటీల క్యాన్సిలేషన్‌కు ఉపాధ్యాయులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
స్పాట్ ప్రారంభానికి ముందు 7 పేపర్లలో సమాధానాలకు మార్కులు ఎలా వేయాలనే దానిపై ఉన్నతాధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తర్వాత దానికి కొనసాగింపుగా సబ్జెక్ట్ నిపుణులతో డీఈవో సమావేశం నిర్వహించి.. పొరపాట్లు జరగకుండా మ రింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొలిరోజు 760 మంది ఉపాధ్యాయులు రిపోర్ట్ చేశారు. స్పాట్ ప్రక్రియకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సైతం వాల్యుయేషన్ ప్రక్రియపై సమాచారం సేకరిస్తున్నారు. కార్యక్రమంలో డీఈవో సోమశేఖర శర్మ, ఏసీ దానా, పరీక్షల విభాగం అధికారులు జీఎస్ ప్రసాద్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గ్గొన్నారు.