ఎండలు మండిపోతున్నాయి. జనం తట్టుకోలేక బయటకు రాలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకవైపు పరిశ్రమలు ఎక్కువగా ఉండటం, మరోవైపు సింగరేణి బొగ్గుబావుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. కొన్నిరోజులుగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ చూపెడుతున్నా.. భద్రాద్రి జిల్లాలో మాత్రం ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తున్నది. ఉపాధి కూలీలు పనులు చేయలేక ఇంటిముఖం పడుతున్నారు. ఇక చిరువ్యాపారులు ఎండలకు జడిసి మధ్యాహ్నం వ్యాపారం బంద్ చేస్తున్నారు. పది గంటలు దాటితే ప్రజలు ఎండకు తట్టుకోలేక నీడను ఆశ్రయిస్తున్నారు. దప్పిక తీర్చుకోవడానికి చలివేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఈసారి అధికారికంగా అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో శీతలపానీయాలను తాగి దప్పిక తీర్చుకుంటున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ఖమ్మం/కరకగూడెం, మే 10
ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి ఏరియాల్లో బొగ్గుబావుల ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. దీంతో సింగరేణి కార్మికులు ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. సెకండ్ షిప్టు చేసేవారు, మొదటి షిఫ్టు నుంచి ఇంటికి వచ్చేవారు ఎండలకు తట్టుకోలేక చెట్ల నీడను ఆశ్రయిస్తున్నారు. వడదెబ్బ తగులుతుందేమో అని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. డ్యూటీల వద్ద మజ్జిగ ప్యాకెట్లను ఇస్తున్నప్పటికీ దాహం తీరడంలేదని కార్మికులు వాపోతున్నారు.
వ్యాపారాలు వెలవెల..
అనేక వ్యాపారాలకు నిలయమైన ఖమ్మం నగరంలో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటిపూట ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారి అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో వర్తక, వాణిజ్య వ్యాపారాలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటితే తప్ప నగర జనం కాలు బయటపెట్టలేని చందంగా మారింది.
పెరిగిన విద్యుత్ వినియోగం..
విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతున్నది. వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు పేద, మధ్య తరగతి ప్రజలు కూలర్లను వినియోగిస్తుండగా ఉన్నత వర్గాలకు చెందిన వారు ఏసీలను వినియోగిస్తున్నారు. గతం కంటే కూలర్లు, ఎయిర్ కండీషన్ల వినియోగం పెరిగిపోవడంతో విద్యుత్ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు జంకకుండా విద్యుత్‌ను అధిక మొత్తంలో వినియోగిస్తున్నారు.
వడదెబ్బ నివారణకు ముందస్తు చర్యలు..
శరీరం అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు శరీరంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా మన శరీరంలో జరిగే రసాయన చర్యల వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. అలా ఉత్పత్తి అయిన ‘వేడి’ మన శరీరంలోని ‘ఉష్ణ సమతుల్యత’ను కాపాడే చర్మం ద్వారా చెమట రూపంలో బయటకు పంపబడుతుంది. కానీ.. మన శరీరం అధిక ఉష్ణోగ్రతకు కానీ, డీ హైడ్రేషన్‌కు కానీ గురైనప్పుడు రక్షణ మార్గాలైన చర్మం, ఊపిరితిత్తులు సరిగా పనిచేయవు. దానివల్ల మన శరీర ఉష్ణోగ్రత ఒక్కసారి అధిక స్థాయికి చేరుకుంటుంది. సాధారణంగా చిన్నపిల్లలు, అత్యధిక వయస్సు ఉన్న వృద్ధులు, క్రీడాకారులు, ఎక్కువగా ఆరుబయట పనిచేసే వారు వడదెబ్బకు గురవుతుంటారు.
మూగజీవాలు విలవిల..
మనుషులకే ఇలా ఉంటే మూగజీవాల పరిస్థితి దారుణంగా ఉంది. బయట చెట్లనీడ లేక తాగునీరు దొరకక విలవిలలాడుతున్నాయి. అధికారులు ఏర్పాటు చేయాల్సిన నీళ్లతొట్టెలు లేకపోవడంతో తాగునీటికి మూగజీవులు అల్లాడిపోతున్నాయి. బయట మేతకు వెళ్లిన జీవాలకు నీరు దొరకక ఎండిపోయిన చెరువుల వద్దకు వెళ్లి బురద నీరు తాగే పరిస్థితి దాపురించింది. ఎండకు తట్టుకోలేక మేతకు వెళ్లిన జీవాలు అక్కడే మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమే..
ప్రస్తుత సీజన్లో వాతావరణంలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా వివిధ రకాల జబ్బులతో బాధపడేవారు ఇటువంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె, డయాబెటిక్ రోగులు ఎండకు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. నీటితోపాటు రాగి జావ, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఎండకు లూజుగా ఉన్న దుస్తులు ధరించడం మంచిది. కార్మికులు పని ప్రదేశంలో నీడ ఉండేలా చూసుకోవాలి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. వడదెబ్బ తగినైట్లెతే వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.
-డాక్టర్ భాస్కర్‌నాయక్, డీఎంహెచ్‌వో, భద్రాద్రి జిల్లా