అది కరోనా సంక్షోభం.. లాక్డౌన్ సమయం.. పిల్లాజెల్లా ఇంటికే పరిమితమైన సందర్భం.. నిరుపేద కుటుంబాల పరిస్థితి దుర్భరం.. ఉపాధి కోసం బయటకు వెళ్లలేని నిర్బంధం.. కుటుంబాన్ని పోషించుకోలేని దైన్యం.. అలాంటి దయనీయమైన కాలాన వారి ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. 2021 నుంచి ఇప్పటివరకు అప్రతిహతంగా ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నది. పంపిణీని ఈ ఏడాది డిసెంబర్ వరకూ కొనసాగించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో భద్రాద్రి జిల్లాలో లక్షలాది మంది పేదలకు లబ్ధి చేకూరనున్నది.
అశ్వారావుపేట, జనవరి 29: జిల్లాలోని పేదలందరికీ ఈ ఏడాది ముగిసే వరకు ఉచితంగా రేషన్ బియ్యం అందించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ నెలలో ఇప్పటికే పంపిణీ ప్రారంభమైంది. 2021 కరోనా సంక్షోభం నుంచి ఇప్పటివరకు అప్రతిహతంగా పంపిణీ కొనసాగుతూనే ఉంది. గతంలో ఉచితంగా అందించిన బియ్యాన్ని సర్దుబాటులో భాగంగా మార్చి వరకు ఒక్కొక్కరికీ 5 కిలోలు, ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 6 కిలోల చొప్పున పంపిణీ చేయాలని ఉత్తర్యుల్లో పేర్కొన్నది. ప్రభుత్వ నిర్ణయంతో భద్రాద్రి జిల్లాలో లక్షలాది మంది పేదలకు ప్రయోజనం చేకూరనున్నది.
జిల్లావ్యాప్తంగా 442 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 2,93,611 కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో ఆహార భద్రత కార్డులు (ఎఫ్ఎస్సీ) 2,74,927. వీటి పరిధిలో 7,95,745 యూనిట్లు ఉన్నాయి. ఎఫ్ఎస్పీ పథకం కింద ఒక్కో కార్డుదారుకు మార్చి నెల వరకు ఐదు కిలోలు, తర్వాత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఆరు కిలోల చొప్పన ఉచితంగా అందుతాయి. అదేవిధంగా అంత్యోదయ ఆహార భద్రత కార్డులు 18,681 కార్డులు ఉండగా 51,218 యూనిట్లు, అన్నపూర్ణ మూడు కార్డులకు మూడు యూనిట్లు ఉన్నాయి. వీరందరికీ బియ్యం అందుతున్నది.
కరోనా కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిరుపేదలకు అండగా నిలిచారు సీఎం కేసీఆర్. ఉపాధి కోసం బయటకు వెళ్లలేక, తిండి తిప్పలు లేక మగ్గుతున్న ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం అందించాలని నిర్ణయించారు. 2021 నుంచి నిరాటంకంగా రేషన్‌కార్డుదారులకు నెల నెలా రేషన్ బియ్యం అందిస్తున్నారు. ఒక్కో కుటుంబంలో సభ్యుల సంఖ్యను బట్టి ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున సరఫరా చేస్తున్నారు. ఇదే విధంగా పంపిణీని ఈ ఏడాది ముగిసే వరకు కొనసాగించాలని సీఎం పౌర సరఫరాలశాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బియ్యం పంపిణీపై అందరికీ స్పష్టత వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకం అమలుపై తన నిర్ణయాన్ని ఆలస్యంగా ప్రకటించింది. 2021 మే నుంచి 2022 డిసెంబర్ వరకు 20 నెలలకు రేషన్నకార్డు ఉన్న ఒక్కో కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 200 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వమే 203 కిలోలు అందించింది. 2021 మే, 2022 మే, జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పంపిణీ చేసిన కిలో బియ్యాన్ని ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సర్దుబాటు చేస్తామని స్పష్టంగా పేర్కొన్నది.
ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యంతో నిరుపేదలకు ప్రయోజనం. సీఎం కేసీఆర్ రెండేళ్ల నుంచి రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యం అందిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది ముగిసే వరకు ఉచితంగా బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆనందాన్నిచ్చింది. సీఎం కేసీఆర్‌కు పేదలందరూ రుణపడి ఉంటారు.
– పరిటాల సత్యావతి, రేషన్ కార్డుదారు, అశ్వారావుపేట
ప్రభుత్వ ఆదేశానుసారం ఉచిత బియ్యం పంపిణీని ఇప్పటికే జిల్లాలో ప్రారంభించాం. జనవరిలో రేషన్‌కార్డు ఉన్న కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నాం. ప్రతి నెలా కమిషన్ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నెల వారీ బియ్యం పంపిణీ చేస్తాం. ప్రభుత్వ నిర్ణయంతో 2,93,611 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.
– మల్లికార్జునరావు, డీసీఎస్వో, కొత్తగూడెం