భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మామిళ్లగూడెం, నవంబర్ 25 : తన నయవంచక విధానాన్ని మరోసారి చాటుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీల 42 శాతం రిజర్వేషన్ల హామీని గట్టున పెట్టి బడుగు, బలహీన వర్గాల ప్రజలను నిండాముంచింది. తన చిత్తశుద్ధి లోపాన్ని తానే రుజువు చేసుకుంది. బీసీల ఓట్ల కోసం గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లిస్తమంటూ హామీ ఇచ్చింది. అంతకుముందే కామారెడ్డి డిక్లరేషన్‌ను ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక అనేక మాటలు చెప్పింది. ఆఖరికి బీసీ బిల్లును చేసి గవర్నర్‌కు పంపడం, ఆయన ఆమోదించకపోవడం, ఇంతలో కోర్టు మొట్టికాయలు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో చివరాఖరుకు చేతులెత్తేసింది.
పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లిస్తామంటూ బుకాయించింది. పాత రిజర్వేషన్ల పద్ధతినే ఎన్నికలకు వెళ్తోంది. ఇందుకోసం జీవో 46నూ విడుదల చేసింది. అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కసీటును కూడా బీసీలకు రిజర్వు చేయకపోవడంతో బహుజనులు భగ్గుమంటున్నారు. ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను వంచించి, తమకు మొండిచేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పంచాయతీ ఎన్నికల్లోనే తగిన బుద్ధి చెబుతామంటూ బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు రఘునాథపాలెం మండలంలో 37 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక్క పంచాయితీ కూడా బీసీలకు రిజర్వు చేయలేదు. 2019 ఎన్నికల్లో 23 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఈ మండలంలో నాలుగు పంచాయతీలు బీసీలకు దక్కాయి.

రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రెండు జిల్లాల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 571 గ్రామ పంచాయతీల్లో 566 పంచాయలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 5 గ్రామ పంచాయతీలు, 46 వార్డులు అంశం న్యాయస్థానంలో ఉండడంతో ఆ పంచాయతీలు, వార్డులకు ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో మొత్తం 566 గ్రామ పంచాయతీలకు, 5,168 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
మూడు విడతల్లో..
ఖమ్మం జిల్లాలో మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 11న మొదటి విడతలో 7 మండలాల్లోని 192 పంచాయతీలకు, 1,740 వార్డులకు; 14న రెండో విడతలో 6 మండలాల్లోని 183 పంచాయతీలకు, 1,686 వార్డులకు; 17న మూడో విడతలో 7 మండలాల్లోని 191 పంచాయతీలకు, 1,742 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా 7,95,138 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 708 పోలింగ్ లొకేషన్లలో 5,166 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. 5,746 బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే మండల కేంద్రాలకు తరలించారు.
ఎన్నికల సిబ్బంది ఇలా..
ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు సిబ్బందిని నియమించారు. వారిలో 13 మంది నోడల్ అధికారులున్నారు. స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులను 191 మంది చొప్పున, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులను 566 మంది చొప్పున ఎంపిక చేశారు. వారికి సహాయ పోలింగ్ అధికారులుగా 3,442 మంది, ఓపీవోలుగా 4,217 మందిని ఎంపిక చేశారు. ఫ్లయింగ్ స్వాడ్స్ బృందాలు 5, స్టాటిక్స్ సర్వేలైన్స్ బృందాలు 15, టీవోటీలు 25, జోనల్ అధికారులు 76, రూట్ అధికారులు 241 మంది నియమించారు. 20 సెంటర్లలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అదే సెంటర్లలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 1,858 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. దీని కోసం మైక్రో అబ్జర్వర్లుగా 648 మంది పని చేయనున్నారు.
రిజర్వేషన్లు ఎలాగంటే..
ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరిగే 566 పంచాయతీలకు, 5,166 వార్డులకు రిజర్వేషన్లను ఇప్పటికే ఖరారు చేశారు. గిరిజన మహిళలకు 75, గిరిజన జనరల్‌కు 91 కలిపి ఎస్టీలకు మొత్తం 166 పంచాయతీలను రిజర్వు చేశారు. ఎస్సీ మహిళలకు 48, ఎస్సీ జనరల్‌కు 62 కలిపి మొత్తం 110 పంచాయతీలు; బీసీ మహిళలకు 24, బీసీ జనరల్‌కు 30 కలిపి మొత్తం 54 పంచాయతీలు; జనరల్ మహిళలకు 112, జనరల్‌కు 124 కలిపి 236 పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా వ్యాప్తంగా మహిళలకు 259, జనరల్‌కు 307 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఇదే నిష్పత్తిలో వార్డు స్థానాలకూ రిజర్వేషన్లు ప్రకటించారు. ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. మొదటి విడత ఎన్నికలున్న మండలాల్లో ఈ నెల 27 నుంచి నామినేషన్లు కూడా స్వీకరించనున్నారు.
భద్రాద్రి జిల్లాలో 471 పంచాయతీలకు..
భద్రాద్రి జిల్లాలోనూ 471 పంచాయతీలకు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపహాడ్, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లోని 159 పంచాయతీలు, 1,436 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లోని 156 పంచాయతీలు, 1,392 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు.
మూడో విడతలో ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లోని 156 పంచాయతీలు, 1,340 వార్డులు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, 2019 పంచాయతీ ఎన్నికల్లో 479 పంచాయతీలకు గాను.. ఎస్టీలకు 46, ఎస్సీలకు 5, జనరల్‌కు 11 స్థానాలు కేటాయించారు. ఈసారి జనరల్‌కు 9 స్థానాలను కేటాయించారు. దీంతో బీసీలు, ఓసీలు కలిపి ఆ తొమ్మిది స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
బీసీలకు రిజర్వేషన్లు సున్నా..
జిల్లాలో మొత్తం 471 పంచాయతీలున్నాయి. వీటిల్లో ఎస్టీ జనరల్‌కు 234, ఎస్టీ మహిళలకు 226, ఎస్సీ జనరల్‌కు 2, జనరల్‌కు 5, జనరల్ మహిళలకు 4 చొప్పున పంచాయతీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. వార్డు స్థానాల రిజర్వేషన్లనూ ఇదే నిష్పత్తిలో పూర్తి చేశారు. జిల్లాలో 6,69,048 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 471 పంచాయతీలు, 4,168 వార్డులకుగాను 4,242 పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. ఆర్వో-1గా 161 మందిని, ఆర్వో-2గా 562 మందిని, పీవోలుగా 5,147 మందిని, ఓపీవోలుగా 5,674 మందిని నియమించారు.
కామారెడ్డి డిక్లరేషన్ పచ్చిమోసం: జూలూరు గౌరీశంకర్
మామిళ్లగూడెం/ ఖమ్మం, నవంబర్ 25: కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలు మహోద్యమానికి సన్నద్ధమవుతున్నారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, తెలంగాణ తొలి బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ స్పష్టం చేశారు. బీసీల ఆశలను వమ్ము చేసి బీసీల గొంతునొక్కిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిన తీరును నిరసిస్తూ ఖమ్మంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్ వద్ద ఉన్న జ్యోతిబాపూలే దంపతుల విగ్రహాల ఎదుట బీసీ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడం అత్యంత మోసపూరిత కుట్రేనని విమర్శించారు. బీసీలను నమ్మించి గొంతు కోశారని ఆరోపించారు. బీసీ జేఏసీ నాయకులు రామ్మూర్తి, మధుగౌడ్, డాక్టర్ కేవీ కృష్ణారావు, రంగరాజు, కృష్ణాచారి, పుల్లారావు, శివరామకృష్ణ, వెంకటరామయ్య, మల్లికార్జున్, శ్రీదేవిపాల్గొన్నారు.
బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్: జేఏసీ నేతలు
ఖమ్మం సిటీ, నవంబర్ 25: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని బీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు ఆర్జేసీ కృష్ణ, మేకల సుగుణారావు అన్నారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాజ్యంగ సవరణ లేకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయడం వీలుకాదని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి పాల్పడుతూ వచ్చిందని విమర్శించారు. ఇప్పుడు అనేక సాకులు చెప్పి 42 శాతం రిజర్వేషన్లకు మంగళం పాడిందని ధ్వజమెత్తారు. కొత్తగా తెచ్చిన జీవో 46 ప్రకారం కూడా బీసీలకు 22 శాతం అమలు చేయకుండా కేవలం 11.7 శాతం మాత్రమే కల్పిస్తోందని మండిపడ్డారు.
ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలు స్పందించి బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రఘునాథపాలెం, తిరుమలాయపాలెం మండలాల్లో సగానికిపైగా బీసీలకు ఏ ఒక్క స్థానాన్ని కూడా రిజర్వు చేయకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. బీసీలకు 22 శాతం అమలయ్యే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాయకులు బిచ్చాల తిరుమలరావు, పిట్టల నాగేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, పెరుగు వెంకటరమణయాదవ్, కొలిచలం గీత, చల్లా హనుమంతు, చైతన్య పాల్గొన్నారు.