ఖమ్మం వ్యవసాయం, మార్చి 30 ;ఈ ఏడాది పత్తి పంట అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది. సీజన్ ఆరంభంలోనే సీసీఐ కంటే అదనంగా ధర పలికిన పత్తి.. నేడు రెండింతలు పెరిగింది. ఖమ్మం మార్కెట్లో బుధవారం ఉదయం జరిగిన జెండాపాటలో రికార్డుస్థాయి ధర పలికింది. క్వింటాల్‌కు రూ.12,350 గరిష్ఠ ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివిధ జిల్లాల రైతులు 1,630 బస్తాలను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. గరిష్ఠ ధర పలుకుతుండడంతో పొరుగు జిల్లాల రైతులు కూడా ఇక్కడికే పంటను తీసుకొస్తున్నారు. ఏటా ఖమ్మం జిల్లావ్యాప్తంగా సుమారు 2.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. ఈ సారి పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. కేవలం 1.88 లక్షల ఎకరాలు సాగైంది. అయితే, డిమాండ్‌కు తగ్గట్టుగా పంట లేకపోవడంతో వ్యాపారులు ఆన్లైన్ బిడ్డింగ్‌లో పోటీ పడుతున్నారు.
ఏటా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 2.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. ఈ ఏడాది పత్తిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. కేవలం 1.88 లక్షల ఎకరాలు సాగైంది. దేశంలో గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ర్టాల్లో పత్తి ఎక్కువ సాగవుతున్నది. కానీ, నాణ్యమైన పంట దిగుబడి రావడం లేదు. మన రాష్ట్రంలో నాణ్యమైన పంట దిగుబడి వస్తుండడంతో ఊహించని విధంగా ధరలు పెరుగు తున్నాయి. ఖమ్మం మార్కెట్లో గరిష్ఠ ధర పలుకుతుండడంతో పొరుగు జిల్లాల రైతులు ఇక్కడికే పంటను తీసుకొస్తున్నారు.
నాణ్యమైన పంట దిగుబడితో…
ధరల పెరుగుదలకు ప్రధాన కారణం నాణ్యమైన పంట దిగుబడి. గతంలో పత్తిబేల్ ఖరీదు రూ40-45 వేలు ఉండగా.. ప్రస్తుతం 90వేలు పలుకుతుంది. పత్తి గింజలకూ భారీ డిమాండ్ ఉండడంతో ఊహించని ధర పెరిగిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. భౌగోళిక పరిస్థితులు, సాగుకు నేలలు అనువుగా ఉండడంతో నాణ్యమైన పంట దిగుబడి వస్తున్నది. మధిర నియోజకవర్గంలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్, ముదిగొండ, పాలేరు నియోజకవర్గంలోని తిరుమలయపాలెం, కూసుమంచి, వైరా నియోజవర్గంలో వైరా, కామేపల్లి, కొణిజర్ల, కారేపల్లి మండలాల్లో ఎక్కువ శాతం నల్లరేగడి భుములున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 80 శాతం రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. మార్కెటింగ్ సౌకర్యం ఉండడంతో సకాలంలో పంటను అమ్ముకునే వెసులుబాటు కలుగుతున్నది.
పోటాపోటీగా ఆన్లైన్ బిడ్డింగ్‌లు
డిమాండ్‌కు తగ్గట్టుగా పంట లేకపోవడంతో వ్యాపారులు పంటను సొంతం చేసుకునేందుకు ఆన్లైన్ బిడ్డింగ్‌లో పోటీ పడుతున్నారు. పోటాపోటీగా బిడ్ చేస్తుండడంతో నేడు సీసీఐ మద్దతు ధరకు రెండింతల ధర పెరిగింది. పత్తి పంటను కొనుగోలు చేసేందుకు స్థానిక ఖరీదుదారులతోపాటు పొరుగు రాష్టాల వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన పంటను తమ రాష్టాలకు ఎగుమతి చేసుకుంటున్నారు. అక్కడి పంటతో కలిపి జిన్నింగ్ చేసుకుంటున్నారని పేర్కొంటున్నారు.
దేశచరిత్రలో తొలిసారిగా..
పత్తి పంటకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఖమ్మం మార్కెట్లో ధర పలికింది. ప్రైవేట్ మార్కెట్లో కంటే అదనంగా ధర రావాలనే ఉద్దేశంతో భారత పత్తి సంస్థ (సీసీఐ) మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6వేలుగా ప్రకటించింది. అయితే, ప్రైవేట్ వ్యాపారులు సీసీఐ కంటే అధిక ధర నిర్ణయించి పంటను కొనుగోలు చేయడం విశేషం. గతేడాది సీసీఐ పంటకు గరిష్ఠ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,750 నిర్ణయించి కొనుగోలు చేశారు. ఈ ఏడాది పంట సీజన్ ప్రారంభం నుంచే ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ ధర నిర్ణయించి పంటను కొనుగోలు చేస్తున్నారు. ఈ సారి పత్తి సాగు చేసిన రైతులకు పెరుగుతున్న ధరలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం జరిగిన జెండాపాటలో పత్తి క్వింటాల్‌కు మరోమారు ఆల్‌టైం రికార్డు సృష్టించి క్వింటాల్‌కు రూ.12,350 గరిష్ఠ ధర పలికింది. వివిధ జిల్లాల నుంచి రైతులు 1,630 బస్తాలను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు.
ఖండాంతరాలకు ఖమ్మం కర్షకుల ఖ్యాతి
ఖమ్మం జిల్లా రైతుల ఖ్యాతి ఖండాంతరాలకు చేరింది. జిల్లాలో సాగైన పత్తికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ పలుకుతున్నది. ఇక్కడ ఉత్పత్తి అయిన తేజారకం మిర్చి పంట చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, అమెరికా వంటి దేశాలకూ ఎగుమతి అవుతున్నది. ఏ రాష్ట్రంలో లేని ధర మన రైతుల పంటకు రావడం సంతోషంగా ఉంది. ధరల పెరుగుదలకు కారణమైన సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
–డౌలే లక్ష్మీప్రసన్న, ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్
జాతీయస్థాయి రికార్డు బ్రేక్ చేయడం సంతోషం
మార్కెట్లో పత్తిపంటకు రికార్డుస్థాయి ధర పలకడం సంతోషంగా ఉంది. ఆన్లైన్ బిడ్డింగ్‌లో క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.12,350 పలికింది. ఇంతవరకు దేశంలో ఎక్కడ పలకలేదు. కొద్ది నెలల నుంచి మార్కెట్లో తేజా మిర్చి ధరలు నిలకడగా ఉండడం, అపరాల ధరలు సైతం మద్దతుకు మించి పలకుతున్నాయి. నేడు సీసీఐ కంటే రెండు రెట్లు అదనంగా పత్తి పంటకు ధర పలుకుతున్నది.
–రుద్రాక్ష మల్లేశం, ఖమ్మం ఏఎంసీ ఉన్నతశ్రేణి కార్యదర్శి