పెనుబల్లి, మే 18: తెలంగాణలో మళ్లీ వచ్చేది కేసీఆరేనని ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్సే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి ఆదివారం వచ్చిన ఆయన.. పెనుబల్లిలో తన చిరకాల మిత్రుడైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోటగిరి సుధాకర్‌బాబు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. ఎవరికీ ఉపయోగపడని పథకాలను తెస్తూ ఖజానాలో చిల్లిగవ్వ లేదంటూ బకాయింపు మాటలు చెబుతోందని ఎద్దేవాచేశారు. తమకెవరూ అప్పులివ్వడం లేదంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే తనస్థాయిని మరిచి మాట్లాడడం అవివేకమని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లనే తమకు నడుస్తలేదంటూ ప్రతిక్షణమూ, ప్రతిరోజూ మాటలు చెబుతుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం.. అభివృద్ధి, సంక్షేమం కోసమే అప్పులు చేసిందని అన్నారు. ఆ అభివృద్ధి ఆనవాళ్లు, ఆ సంక్షేమ పథకాలు ఇప్పటికీ కళ్లముందే కన్పిస్తున్నాయని అన్నారు. అవి ఎప్పటికీ చెరగని ముద్రగా నిలిచిపోతాయని అన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చూసి మోసపోయామంటూ తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఏ క్షణమైనా ఎన్నికలొస్తే బీఆర్ఎస్కే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కోటగిరి సుధాకర్‌బాబు, తేజావత్ తావునాయక్, ఎస్కే గౌస్, వంగా గిరిజాపతి, చీపు కృష్ణారావు, కొప్పుల రాంబాబు, బజ్జూరి గోపి, జానీ, చీపు శ్రీను, బొర్రా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.