కారేపల్లి,డిసెంబర్ 22:ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన ప్రజా ప్రతినిధులు సోమవారం తమ బాధ్యతలను స్వీకరించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయాలలో గ్రామపంచాయతీ ప్రజల సమక్షంలో సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు. సింగరేణి మండలంలో గల 41 గ్రామపంచాయతీలలో పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయితీ కార్యదర్శులు సర్పంచ్ ఉపసర్పంచులతో పాటు వార్డు సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేపించారు. అనంతరం సర్పంచులు తమ కుర్చీలలో ఆసీనులై బాధ్యతలు స్వీకరించారు.
ఆ తర్వాత నూతనంగా బాధ్యతలు చేపట్టిన తమ ప్రజాప్రతినిధులను స్థానికులు పుష్ప గుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మండల పరిధిలోని కొత్త తండా గ్రామపంచాయతీ సర్పంచుగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ధరావత్ మంగీలాల్ తన పాలకవర్గ సభ్యులతో కలిసి అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మంగీలాల్ మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఏకగ్రీవం చేసిన గ్రామ పంచాయతీ ప్రజలకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొత్తతండా గ్రామపంచాయతీని జిల్లాలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దెందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.