మామిళ్లగూడెం, జూలై 12: ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం అధికారులు కృషిచేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ కోరారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసమే జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్ పని చేస్తోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో శుక్రవారం పర్యటించిన ఆయన.. ‘గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు ఎస్టీ సబ్ ప్లాన్’ తదితర అంశాలపై కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అడిగిన చోట్ల.. ప్రవేశ పరీక్షలతో సంబంధం లేకుండా సీట్లు కేటాయించాలని, ట్రైకార్ లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలని, పోడు పట్టాల విషయమై చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన వికాసంపై గిరిజనులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, ఖర్చులు, మిగుళ్లపై పూర్తి నివేదిక సమర్పించాలన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమం కోసం వివిధ శాఖల ద్వారా కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్వోఎఫ్ఆర్ కింద 2022లో కొత్త దరఖాస్తులు స్వీకరించి 6,589 మందికి 13 వేల ఎకరాల భూమిపై హక్కులు కల్పించి పట్టాలు మంజూరు చేశామని వివరించారు. ఎకో టూరిజంలో గిరిజనులకే ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. గిరిజన విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, బోధన వంటివన్నీ ఉచితంగానే అందిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి కమిషన్ సభ్యుడు వినతులు స్వీకరించారు. పరిష్కార చర్యల కోసం వాటిని సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు. అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, నరేశ్‌కుమార్, ఎం.రాజేశ్వరి, విజయలక్ష్మి, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గిరిజనుల సమస్యల సత్వర పరిష్కారం కోసమే జాతీయ ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ పేర్కొన్నారు. జిల్లా పర్యటన నిమిత్తం శుక్రవారం ఖమ్మానికి చేరుకున్న ఆయన.. ఇక్కడి ఎన్ఎస్పీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా గిరిజనులకు చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కులు దక్కేవిధంగా కమిషన్ చర్యలు తీసుకుంటుందని అన్నారు. దేశంలో వివిధ గిరిజనులకు సంబంధించిన వివిధ అంశాలకు చెందిన 20 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. గిరిజననుల సమస్యలను పరిష్కరించేందుకు ఇక నుంచి హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయం అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.