ఖమ్మం అర్బన్‌లోని మట్టిగుట్టలు మాయమవుతున్నాయి. గుట్టలపై కన్నేసిన ఓ వ్యాపారి రూ.కోట్ల విలువైన మట్టిని కొల్లగొట్టాడు. మట్టి వ్యాపారంతో రూ.కోట్లకు పడగలెత్తాడు. అధికార పార్టీ నేతల అండదండలు మెండుగా ఉండడంతో మట్టి వ్యాపారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అధికార పార్టీ నేతలు ‘తవ్వుకో.. అమ్ముకో..’ అంటూ భరోసా ఇవ్వడంతో ‘నాకు ఇంకెవ్వరు అడ్డు’ అన్నట్లుగా రెచ్చిపోతున్నాడు. ఒకప్పుడు ఒకటీ రెండు ట్రాక్టర్లతో మొదలైన మట్టి ఘనుడి వ్యాపారం.. ప్రస్తుతం సొంతంగా మూడు పెద్ద మెషీన్లు, పదుల సంఖ్యలో టిప్పర్లకు చేరిందంటే వ్యాపారం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఓబులాపురం మైనింగ్‌ను తలపించేలా సాగుతున్న ఘనుడి వ్యాపారానికి అర్బన్‌లోని మట్టి గుట్టలన్నీ కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఏళ్లుగా ‘మూడు పువ్వులు – ఆరు కాయలు’గా సాగుతుండడంతో ఖమ్మం అర్బన్ బాలప్పేట తండాకు ఆనుకొని ఉన్న మట్టి గుట్టలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. ఖమ్మం నగర పరిధిలో రూ.వందల కోట్ల విలువైన మట్టిని అక్రమార్కులు అక్రమంగా అమ్ముకుంటున్నా అధికారులు కనీసం అటుగా కన్నెత్తి కూడా చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-ఖమ్మం, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం అర్బన్ బాలప్పేట బైపాస్ రోడ్డులో వెళ్తుంటే బల్లేపల్లి రెవెన్యూ పరిధి 37, 38 సర్వే నంబర్లకు చెందిన ప్రభుత్వ భూముల్లో ఉన్న గుట్టల్లో దట్టమైన చెట్ల నుంచి వీచే చల్లటి గాలులతో వాహనదారులకు ఎంతో హాయిగా అనిపించేది. సుమారు రెండు కిలోమీటర్ల మేర ప్రయాణం చేసినా కనిపించే గుట్టలు ఇదే తరహా ఆహ్లాదాన్ని అందించేవి. కానీ ఇప్పుడు ఆ గుట్టలు మాయమైపోయాయి. మట్టి వ్యాపారి ధన దాసోహానికి బైపాస్ రోడ్డుకు ఆనుకొని పచ్చని చెట్లతో కప్పబడి కనిపించిన గుట్టలన్నీ ఆవిరైపోయాయి.
తనకోసమే గుట్టలు వెలిశాయన్నట్లుగా వ్యాపారి ఏళ్లుగా తన అక్రమ సంపాదనకు అడ్డాగా చేసుకున్నాడు. ఫలితంగా ‘ఒకప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున గుట్టలు ఉండేవి’ అని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఇక్కడ మట్టి వ్యాపారం ఏ మేరకు సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం అర్బన్‌లో మట్టి వ్యాపారి అంటే అతడే అని చెప్పుకునే స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించాడంటే ఘనుడు ఎంతటి ఘనాపాటో కూడా ఇట్టే తెలుసుకోవచ్చు.
ఒకప్పుడు సారా బెల్లం వ్యాపారంతో అక్రమ సంపాదన రుచిచూసిన ఆ వ్యక్తి.. కాలక్రమేణా మట్టి వ్యాపారంలో లాభాలను తెలుసుకొని నివాసానికి పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్లోని మట్టి గుట్టలపై కన్నేశాడు. తెలంగాణ రాకముందు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకుడి అండదండలతో ఇష్టానుసారంగా గుట్టలను కొల్లగొట్టిన సదరు మట్టి వ్యాపారి.. ఆ తరువాత ప్రత్యేక రాష్ట్రం అనంతరం వచ్చిన బీఆర్ఎస్ సర్కారులో స్థానిక బీఆర్ఎస్ నాయకుల ఒత్తిడికి భయపడి వ్యాపారాన్ని అంతంత మాత్రంగా నిర్వహించుకుంటూ వచ్చాడు.
ఇప్పుడు పట్టపగ్గాల్లేకుండా..
ఇప్పుడు అధికార పార్టీ నాయకుల అండదండలు మెండుగా కలిగిన మట్టి ఘనుడికి మట్టి అక్రమ వ్యాపారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. ఇంకేముంది, బల్లేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 37, 38లలోని మట్టి గుట్టలను తవ్వేందుకు అవసరమైన మెషీన్లను, రవాణాకు చేసేందుకు పెద్ద టిప్పర్లను అధిక సంఖ్యలో కొనుగోలు చేశాడు. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా గుట్టలను కొల్లగొట్టి మట్టి అమ్మకాలు సాగిస్తున్నాడు. ఆయా రెవెన్యూ పరిధిలోని గుట్టల్లోకి మరే ఇతర మట్టి వ్యాపారులను అడుగుపెట్టనీయడం లేదంటే అధికార పార్టీ అండదండలు ఎంత స్థాయిలో ఉన్నాయే అర్థం చేసుకోవాలి.
వ్యాపారి ఆగడాలను వివరిస్తూ బల్లేపల్లికి చెందిన అధికార పార్టీకి చెందిన మరో మట్టి వ్యాపారిపై సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలోనూ పోస్టు చేశాడు. ఆ వీడియోలో ‘ఓ పెద్ద’ అండదండలతో సదరు మట్టి వ్యాపారి తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదనతో పోస్టు పెట్టాడు. ప్రస్తుతం 37, 38 సర్వే నంబర్లలోనే రేయింబవళ్లూ మెషీన్లు పనిచేస్తుండగా టిప్పర్లు నిరంతరం మట్టి తొలకాలను జరుపుతూనే ఉన్నాయి.
మైనింగ్ ఏడీ ఏమన్నారంటే..
మట్టి తవ్వకాలపై మైనింగ్ ఏడీ సాయినాథ్‌ను వివరణ కోరగా.. తొలుత మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు. కానీ గుట్టల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలపై విషయమై అడుగగా.. గుట్టలు ఉన్న చోట ఎవరికైనా చదును చేసుకోవడానికి హక్కు ఉంటుందని సమాధానం చెప్పారు. మట్టి తవ్వకాలపై తొలుత ఎవరికీ అనుమతులే ఇవ్వలేదని చెప్పిన ఆయన.. ఆ తరువాత ‘గుర్తుకు వచ్చింది.. మట్టి కావాలంటే తోలుకోడానికి అనుమతులు ఇచ్చాం..’ అంటూ పొంతన లేకుండా సమాధానాలు చెప్పారు.