కారేపల్లి, సెప్టెంబర్ 11 : పోకిరిల పాడు పనులకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. దేవాలయాలుగా భావించే విద్యాలయాలలో రాత్రి వేళల్లో వికృత చేష్టలకు పాల్పడి విద్యార్థులు, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బాజు మల్లాయిగూడెం గ్రామం నడిబొడ్డులో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన ప్రాంగణంలో ఆకతాయిలు రాత్రి వేళల్లో మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో దుర్వాసన భరించలేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో బాజు మల్లాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన ప్రాంగణంలో పోకిరిలు మద్యం తాగి సీసాలు పగులగొట్టారు. సిగరెట్ పీకలు, గుట్కా ప్యాకెట్లు విచ్చలవిడిగా పడవేశారు. పాఠశాల భవనాలకు చుట్టూ రక్షణగా ప్రహరీ గోడలు లేకపోవడం వల్లే చెడు వ్యసనాలకు బానిసలైన వారు బడులను అడ్డాలుగా ఎంచుకున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించి పోకిరిలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి ఆట అరికట్టవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Karepally : ప్రభుత్వ పాఠశాలల్లో పోకిరిల పాడు పనులు