ఖమ్మం, ఏప్రిల్ 22: రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా శనివారం ఆయన గొల్లగుడెం ఈద్గాలో ప్రార్థనలో పాల్గొని నమాజ్ చేశారు. అనంతరం ముస్లిం సోదరులను ఆత్మీయ ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని అన్నారు. అల్లా దయతో ప్రజాలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలనూ అధికారికంగా నిర్వహిస్తున్నదని, తెలంగాణలో సర్వమత సామరస్యం వెల్లివిరిస్తున్నదని అన్నారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి రూ.వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా ఈద్గా చుట్టూ ప్రహరీ నిర్మించాలని పలువురు ముస్లిం పెద్దలు చేసిన విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆయా నిర్మాణానికి అయ్యే అంచనాను తయారు చేయించి ఇవ్వాలని సూచించారు. సీడీపీ నుంచి నిధులు వెచ్చించి ప్రహరీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.