కారేపల్లి, సెప్టెంబర్ 17 : గ్రామ పంచాయతీ కార్మికుల బ్రతుకులు ప్రభుత్వ భరోసాకు నోచుకోవటం లేదని గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ ఖమ్మం జిల్లా మహాసభ బుధవారం కారేపల్లిలోని వైఎస్ఎన్ గార్డెన్లో జరిగింది. ఈ మహా సభకు ముఖ్య అతిధిగా హాజరైన చాగంటి వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రాణాలు పణంగా పెట్టి పంచాయతీ కార్మికులు ప్రజలకు ఆరోగ్య రక్షకులుగా పని చేస్తున్నారన్నారు. 1981 నుండి పంచాయతీ కార్మికులుగా పని చేస్తున్నా నేటికి పర్మినెంట్ కాని పరిస్ధితి ఉందన్నారు. జీపి వర్కర్లను కనీసం కార్మికులుగా గుర్తించటం లేదని, ఈఎస్ఐ, పీఎఫ్, భీమా వంటి సౌకర్యాలు కల్పించకుండా పని చేయిస్తున్నారన్నారు.
ఎంపీడబ్ల్యూ విధానంలో సమయ పాలన లేక సరైన, సకాలంలో వేతనాలు లేక కుటుంబాలు అవస్ధలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 92 వేల మంది పంచాయతీ వర్కర్లకు గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు ప్రతి నెల ఒకటవ తేదిన ఇస్తానని జనవరి`2024 మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దానిని అమలు చేయడం లేదన్నారు. కార్మికుల సమస్యలపై మంత్రులకు విన్నవిస్తే సానుకూలంగా స్పందించడమే తప్పా అమలుకు చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్హత ఉన్న వర్కర్లకు పదోన్నతి, కనీస వేతనం రూ. 26 వేలు, ఉద్యోగ భద్రత, ఎంపీడబ్ల్యూ విధానం రద్దు వంటి సమస్యలపై ఐక్య పోరాటాలకు కార్మికులు సిద్దం కావాలని కోరారు.
మహా సభలో కార్మికుల సమస్యలపై పోరాట కార్యాచరణ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కారేపల్లిలో జీపీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు సుధాకర్, బండ్ల అప్పిరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కె.నాగరాజు, పెరుమళ్ల మోహన్ రావు, నాయకులు కె.నరేంద్ర, బషీరుద్దీన్, ఎస్కే. హుస్సేన్, ఎస్.నాగేశ్వరరావు, కొండబోయిన నాగేశ్వరరావు, వజ్జా రామారావు పాల్గొన్నారు.