ఖమ్మం అర్బన్, జనవరి 31: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లోని డీఐఈవో కార్యాలయంలో డెక్ (డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ) సభ్యులతో ఇటీవల సమీక్ష కూడా నిర్వహించారు. తాజాగా శనివారం ఖమ్మం నయాబజార్ జూనియర్ కళాశాలలో కూడా పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. జిల్లాలో ఫిబ్రవరి 2 నుంచి 11వ తేదీ వరకు రెండు స్పెల్స్‌లో పరీక్షలు జరగనున్నాయి. గతంలో నాలుగు విడతల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరపగా, ఈసారి రెండు విడతల్లో ప్రయోగ పరీక్షలు పూర్తి చేసేలా షెడ్యూల్‌ను రూపొందించారు. జిల్లాలోని గురుకుల కళాశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఈసారి కీలకంగా డెక్ సభ్యులు..
ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో డీఐఈవో రవిబాబుతోపాటు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ (డెక్) సభ్యులు కీలకంగా వ్యవహరించనున్నారు. ముగ్గురు సభ్యులను నియమించగా.. ఇందులో ఇద్దరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎన్.విజయకుమారి, ఎస్డీ. యూసఫ్ కాగా.. మరో అధ్యాపకుడు వి.ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం 67 కేంద్రాలను ఎంపిక చేశారు. మొదటి స్పెల్‌లో 43, రెండో స్పెల్‌లో 38 కళాశాలల్లో విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో డెక్ సభ్యుడికి 22 కేంద్రాలను కేటాయింగా.. ఆయా కేంద్రాల్లో జరిగే పరీక్షల నిర్వహణను ఆయా సభ్యులే పర్యవేక్షించి డీఐఈవోకి నివేదిస్తారు.
ఎగ్జామినర్ల కేటాయింపు
ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్‌గా ఆయా కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లు వ్యవహరించనున్నారు. సబ్జెక్ట్‌కు బోర్డు అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు చెందిన అధ్యాపకులను ఎగ్జామినర్లుగా నియమించారు. జిల్లాలో 318 మంది జనరల్ ఎగ్జామినర్లు కాగా, 112 మంది ఒకేషనల్ ఎగ్జామినర్లను నియమించారు. పరీక్ష జరిగే కేంద్రం కేటాయించిన తర్వాత ఎగ్జామినర్ ముందు రోజే ఆ సెంటర్‌ను పరీక్షించి బోర్డు నిబంధనల ప్రకారం సౌకర్యాలు, పరికరాలు ఉన్నాయా? లేదా? అనే అంశంపై సర్టిఫికెట్‌ను డెక్ సభ్యులకు అందించారు. ఒకవేళ ఎగ్జామినర్ విజిట్ చేయకపోతే కళాశాల ప్రిన్సిపాల్ డీఐఈవోకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
వెంటనే మూల్యాంకనం
పూర్తి సీసీ కెమెరాల నిఘాలో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయగా, పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు ఎగ్జామినర్ ఫోన్‌కు ప్రశ్నాపత్రం డౌన్లోడ్ చేసుకునేందుకు ఓటీపీ వస్తుంది. దాని ఆధారంగానే ప్రశ్నపత్రం అందజేయనున్నారు. పరీక్షలు పూర్తయిన వెంటనే మూల్యాంకనం చేసి మార్కులను అప్లోడ్ చేసేలా నిబంధనలు పెట్టారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 13,007 మంది కాగా, బైపీసీలో 2,742 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఒకేషనల్‌లో 1,858 మంది హాజరుకానున్నారు. ఫస్ట్ స్పెల్ ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు, రెండో స్పెల్ ఫిబ్రవరి 7 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు.