పెనుబల్లి, వేంసూరు, తల్లాడ, డిసెంబర్ 10 : మాండూస్ తుఫాన్ ప్రభావం అన్నదాతలను కలవరపెడుతున్నది. వారంరోజులుగా ప్రకృతి రైతులతో దోబూచులాడుతోంది. దీంతో చేతికొచ్చిన పంట చేజారిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తల్లాడ, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో విక్రయానికి ధాన్యం సిద్ధంగా ఉంది.
తుఫాను ప్రభావంతో రైతులు ధాన్యం రాశులపై పట్టాలు కప్పి ఉంచారు. కాటా వేసిన ధాన్యాన్ని లారీలతో సీసీ కేంద్రాల వద్ద ఎగుమతి చేసేందుకు లారీలకు లోడు చేస్తూ ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. పంట కోసి మద్దతు ధరకు అమ్మితే లాభసాటిగా ఉంటుందని కర్షకులు భావిస్తున్నారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. తేమశాతం యంత్రాల ద్వారా కచ్చితంగా వస్తేనే ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుందనే ఉద్దేశంతో ఖాళీ ప్రదేశాల్లో ధాన్యాన్ని ఆరబోశారు. ఈ సమయంలో తుఫాను ప్రభావంతో వాతావరణంలో మార్పుల రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండ రాగానే ధాన్యం ఆరబోయడం, చిరుజల్లులు పడటంతో కుప్పలు వేయడం చేస్తున్నారు.