కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కష్టాలు వర్ణణాతీ తంగా ఉన్నాయి. ఈ యాసంగిలో పండిం చిన వరి ధాన్యం, మొక్కజొన్నలను అమ్ముకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. మద్దతు ధరతోపాటు బోనస్ లభిస్తుందన్న ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వ మాటలు నమ్మి రైతులు కొనుగోలు కేంద్రాలకు వడ్లు, మక్కలను తీసుకురాగా.. ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఎఫ్ఏక్యూ(ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) విధానం వల్ల ధాన్యం కొనుగోళ్లు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కాంటాలు వేసిన బస్తాలను సైతం తరలించేందుకు సరిపడ లారీలు, గోదాములు లేకపోవడంతో ఎక్కడి బస్తాలు అక్కడే ఉన్నాయి. మిల్లర్ల యజమానులు 10కిలోల వరకు తరుగు తీయడం, లారీ యజమానులు బస్తాకు రూ.50 చొప్పున వసూలు చేస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రజా సంఘాలు ఆందోళనలుచేస్తున్నా.. రైతన్నలు రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేస్తున్నా రేవంత్ సర్కార్కు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరం.
బోనకల్లు/ జూలూరుపాడు/ పాల్వంచరూరల్/ చుంచుపల్లి, మే 13 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతుల పరిస్థితి కత్తి మీద సాములా తయారైంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొకజొన్న బస్తాలు కాంటాలు వేసినప్పటికీ వాటిని గోదాములకు తరలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద తమ పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. పేరుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలని, ప్రయోజనం మాత్రం శూన్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేస్తుందని నమ్మి కేంద్రాలకు వస్తే, ఇకడ పరిస్థితి దారుణంగా ఉందని రైతులు వాపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెబుతూ ఆచరణలో మాత్రం రైతులను మోసం చేస్తోందని మండిపడుతున్నారు. బోనకల్లు, చింతకాని, ముదిగొండ మండలాల్లో సుమారు 79 వేల ఎకరాల్లో మొకజొన్న సాగు చేశారు. ఎకరాకు 35 నుంచి 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.. కానీ, పరిస్థితి చూస్తుంటే ఆశలు ఆవిరైపోతున్నాయని రైతులు భయాందోళన చెందుతున్నారు. అటు ఎండ నుంచి, ఇటు అకాల వర్షాల నుంచి ధాన్యం, మక్కలను కాపాడుకునేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బస్తాలు నింపిన తర్వాత వాటిపై టార్పాలిన్ కవర్లు కప్పి, రాత్రింబవళ్లు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే కాంటాలు వేసిన బస్తాలను యుద్ధప్రాతిపదికన లారీల ద్వారా గోదాములకు తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే తమకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.

అందని మద్దతు.. ఆదుకోని ప్రభుత్వం
రైతురాజ్యం అని కాంగ్రెస్ ప్రభుత్వం గంభీర ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో 25 రోజులుగా కల్లాల్లోనే రైతులు తమ పంటలకు కాపలా కాస్తున్నారు. ప్రభుత్వం గ్రేడ్-ఏ ధాన్యానికి మద్దతు ధర రూ.2,389 నుంచి రూ.2,369 ప్రకటించడమే కాకుండా అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసింది. కానీ, అధికారులు ఎఫ్ఏక్యూ నిబంధనల పేరిట కొర్రీలు పెడుతూ కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ఫలితంగా గత్యంతరం లేక రైతులు దళారులను ఆశ్రయించి కేవలం రూ.1,300కే ధాన్యాన్ని తెగనమ్ముకుంటున్నారు.
తరుగు దందా.. అధికారుల మౌనం
క్వాలిటీ లేని ధాన్యాన్ని మిల్లుకు పంపాలంటే ప్రభుత్వం నిర్ణయించిన 3 కిలోల తరుగు కాకుండా, అదనంగా 10 కిలోలు ఇస్తేనే కొంటామంటూ మిల్లర్లు మెలిక పెడుతున్నారు. మిల్లర్ల ఈ అక్రమ వసూళ్లకు భయపడి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తీసుకోవడం ఆపేస్తున్నారు. అధికారులు ఈ దోపిడీని అరికట్టాల్సింది పోయి, నాణ్యత లేదనే వంకతో బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు.
లారీల కొరత.. పేరుకుపోతున్న నిల్వలు
కొనుగోలు కేంద్రాల్లో లారీల కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. పాల్వంచరూరల్ మండలం సోములగూడెం కేంద్రంలో జగన్నాథపురం, కేశవాపురం, రంగాపురం, నాగారం, సూరారం తదితర ప్రాంతాల నుంచి రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే వందలాది బస్తాలు కేంద్రంలో కాంటా వేసి గోడౌన్లకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, లారీల జాడ లేదు.
ఎఫ్ఏక్యూ విధానం.. రైతులకు శాపం..
ఎఫ్ఏక్యూ(ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) విధానం వల్ల ధాన్యం కొనుగోళ్లు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తేమ శాతం 17 వరకు ఉంటే ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు.. కానీ, ప్రస్తుతం ఎఫ్ఏక్యూ ప్రమాణాలు పూర్తిగా పాటించిన ధాన్యాన్నే కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో వ్యవసాయ అధికారులు ధాన్యంలో తేమ శాతం, తాలు గింజలు, రంగుమారిన గింజలు, నాణ్యమైన గింజల శాతం తదితర అంశాలను పరీక్షించి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే కొనుగోలు చేపడుతున్నారు. దీంతో ధాన్యం పరిశీలన ప్రక్రియ ఎకువ సమయం తీసుకుంటోందని రైతులు వాపోతున్నారు. రోజుకు కేవలం నలుగురు రైతుల ధాన్యాన్నే పరిశీలించి కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొనడంతో మిగతా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద రోజులతరబడి వేచి ఉండాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత విధానంలోనే కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రజా సంఘాల ఆగ్రహం..
పాల్వంచ/ బూర్గంపహాడ్/ వైరాటౌన్, మే 13 : రైతులు కష్టపడి పండించిన మక్కలను, వడ్లను యుద్ధప్రాతిపదికన మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిత్యం ఆయాచోట్ల ప్రజా సంఘాలు ఆందోనలు చేస్తున్నాయి. బుధవారం పాల్వంచలోని ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కలెక్టర్, అదనపు కలెక్టర్, సివిల్ సైప్లె, వ్యవసాయ శాఖ అధికారులకు రైతుల సమస్యలతో కూడిన వినతిపత్రాలు అం దించారు. జిల్లా కార్యదర్శి ఏనుగు చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి జాప్యం జరుగుతోందని, రైతులకు నష్టమొస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పూనెం రంగయ్య, భూక్యా హర్జ్యా, రామచంద్రు, ఎట్టి నరసింహారావు, పూనెం రమేశ్ పాల్గొన్నారు. చుంచుపల్లి మండలంలోని పెనగడప ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రైతు సంఘం నాయకులు పరిశీలించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ తరుగు లేకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్, సీతారాములు పాల్గొన్నారు. వైరా మండలం లాలాపురం కొనుగోలు కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు రైతులతో కలిసి నిరసన తెలిపారు. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, అదనపు చార్జీలు లేకుండా మొక్కజొన్న లారీలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న సివిల్ సైప్లె అధికారులు, తహసీల్దార్ అరుణ, వ్యవసాయ అధికారులు లాలాపురం కొనుగోలు కేంద్రానికి చేరుకొని గురువారం నుంచి ధాన్యాన్ని తరలిస్తామని హామీ ఇచ్చారు. చలపతిరావు, నర్సయ్య, బ్రహ్మేశ్వరరావు, ప్రభాకర్, రహీం, ప్రసాద్, భూషణం, పురుషోత్తం, సోందు పాల్గొన్నారు.

ప్రైవేట్ వ్యక్తికి విక్రయించా..
ప్రభుత్వం బోనస్ ఇస్తుందంటే సంబురపడ్డాం. కానీ, ఇకడ మా ధాన్యాన్ని కనీసం మద్దతు ధరకు కూడా తీసుకోలేదు. క్వింటాకు రూ.1000 నష్టపోతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. కళ్ల ముందే దళారులు దోచుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది. 20 రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం వద్ద కాపలా ఉన్నాను. తీరా నాణ్యత లేదని కొనమని చెప్పారు. చేసేదిలేక ఇక్కడే రూ.1,300లకు ప్రైవేటు వ్యక్తికి విక్రయించా.
– పాతర్లపాటి లక్ష్మణరావు, రైతు, కాకర్ల, జూలూరుపాడు మండలం