అశ్వాపురం, మే 19: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. అశ్వాపురం మండలం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, సీతారాంపురంలో శివసాయి రైస్‌మిల్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు, కొనుగోలు ప్రక్రియ, రవాణా ఏర్పాట్లు, రైతులకు అందుతున్న సేవల తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో 5,550 ధాన్యం బ్యాగులు నిల్వలు ఉన్నట్లు కలెక్టర్‌కు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే తూకం, రికార్డు నమోదు, నిల్వ, రవాణా ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నాణ్యతా ప్రమాణాల మేరకు పారదర్శకంగా కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం అక్కడి హమాలీలతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. వారికి తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం, ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. తొలుత మల్లెలమడుగులో జనగణన సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి సర్వే తీరును పరిశీలించారు. ఎన్యూమరేటర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేటర్ల ఐడీ కార్డులపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వారి పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, ప్రజలు అధికారిక సిబ్బందికి సహకరించి కచ్చిత సమాచారం అందించాలని కోరారు. తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో ముత్యాలరావు, ఏడీఏ తాతారావు, ఏఎస్వో రాజ్యలక్ష్మి, ఆర్ఐ లీలావతి, సర్పంచ్ మర్రి సంధ్యారెడ్డి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్‌బాబు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
