సారపాక/భద్రాచలం డిసెంబర్ 16: నాలుగేళ్లుగా భద్రాచలం, సారపాక పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంతో ప్రభుత్వం వాటిని మున్సిపాలిటీలుగా మార్చుతుందనే ఊహాగానాలు వినిపించాయి. వాటన్నింటికీ పుల్‌స్టాప్ పెడుతూ శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ భద్రాచలం పంచాయతీని మూడు పంచాయతీలుగా, సారపాకను రెండు పంచాయతీలుగా ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. భద్రాచలం పంచాయతీ పరిధిలో 70 వేల జనాభా ఉండగా 30వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. సారపాక పంచాయతీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 20,164 జనాభా ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 30 వేలకు చేరుకున్నట్లు ఓ అంచనా. ఓటర్లు 21 వేల మందికి పైగా ఉంటారని సమాచారం.
భద్రాచలం విభజన ఇలా..
నిన్నటివరకు ఒకే పంచాయతీగా ఉన్న భద్రాచలం ప్రభుత్వ జీవో జారీతో మూడు పంచాయతీలుగా మారనున్నది. భద్రాచలం ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ కేంద్రం. తాజా ఉత్తర్వులతో భద్రాచలం రెవెన్యూ విలేజ్‌లో భద్రాచలం, సీతారామనగర్, శాంతినగర్ పంచాయతీలుగా మారనున్నది. భద్రాచలం పంచాయతీ పరిధిలో 700 ఎకరాల విస్తీర్ణం 21 వార్డులు, రెండోపంచాయతీ సీతారాంనగర్ 349 ఎకరాల విస్తీర్ణంలో 17వ వార్డులు, మూడో పంచాయతీగా శాంతినగర్ 997 ఎకరాల విస్తీర్ణంలో 17 వార్డులు ఉంటాయి.
సారపాక విభజన ఇలా..
పారిశ్రామిక వాడగా పేరున్న సారపాక ఇకపై సారపాక, ఐటీసీ పంచాయతీలుగా మారనున్నది. సారపాక పంచాయతీ 1,730 ఎకరాల విస్తీర్ణంలో 17 వార్డులు, ఐటీసీ పంచాయతీ 2,512 ఎకరాల విస్తీర్ణంలో 15 వార్డులతో ఏర్పాటు కానున్నది. సారపాక మున్సిపాలిటీ అవుతుందని భావించిన తరుణంలో ఇటీవల ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పంచాయతీ అవుతుందని ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో భద్రాచలం, సారపాక మున్సిపాలిటీ అంశానికి తెరపడినట్లయింది.