చండ్రుగొండ, నవంబర్ 27: మండలంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న గొత్తికోయలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అటవీశాఖాధికారులు ఆదివారం వారికి నోటీసులు జారీ చేశారు. ఎఫ్డీవో అప్పయ్య ఆధ్వర్యంలో చండ్రుగొండ రేంజ్ పరిధిలోని అటవీశాఖ సిబ్బందితో అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్డీవో మాట్లాడుతూ అటవీహక్కుల చట్టం ప్రకారం.. గొత్తికోయలకు అటవీ ప్రాంతంలో నివసించే హక్కులేదన్నారు.
గొత్తికోయలు 2016 తర్వాత అటవీ ప్రాంతానికి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. ఎక్కడి నుంచి ఇక్కడకు వలస వచ్చారో అదే ప్రాంతానికి వెళ్లిపోవాలని గొత్తికోయలను కోరారు. అటవీశాఖ సిబ్బంది ఎలాంటి భయం లేకుండా విధులు సక్రమంగా నిర్వహించుకోవాలన్నారు. ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నదని ధైర్యం కల్పించారు.