ఖమ్మం, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట, పినపాక నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో సోమవారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు తండోప తండాలుగా కదలివచ్చారు. సభా ప్రాంగణాలు కిక్కిరిసిపోవడంతో రహదారులు, చెట్లపైకి ఎక్కి ఆసక్తిగా తిలకించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం కొనసాగినంతసేపు జనం ‘జై కేసీఆర్.. జై జై కేసీఆర్.. జయహో తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. సభలో గాయని మధుప్రియ బృందం ఆటా పాట సభికులను అలరించాయి. రెండు సభల్లోనూ పార్టీ శ్రేణుల అభిమానం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ధరణి, రైతుబంధు వద్దని కాంగ్రెస్ ఇప్పటికే చెబుతున్నదని సీఎం అనడంతో ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి పథకాలు యాథావిధిగా కొనసాగించాలని చేతులెత్తి తమ ప్రతిస్పందనను తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి పడ్డ కష్టాన్ని, ఎదుర్కొన్న ఒడిదొడుకులను, అప్పటి పాలకులు పెట్టిన కష్టాలను సీఎం వివరించడంతో ప్రజలు మంత్రముగ్ధులై ఆసక్తిగా ఆలకించారు.
తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ నేతలు అని, తెలంగాణ సిద్ధించే వరకు నిక్కచ్చిగా పోరాడడంతోనే స్వరాష్ట్రం ఏర్పడిందని చెప్పినప్పుడు హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ఏడు ప్రజా ఆశీర్వాద సభలకు సబ్బండ వర్గాల ఆశీస్సులు లభించాయి. ప్రతి సభల్లోనూ జనప్రవాహం ఉప్పొంగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అశ్వారావుపేట నియోజకవర్గంలో పర్యటించడం తొలిసారి కావడంతో ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున గిరిజనులు తరలివచ్చారు. మన్యం ప్రజల సమస్యలను వివరిస్తున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలోని ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో సభకు హాజరయ్యారు. పినపాక నియోజకవర్గ సభలో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజల సమస్యలను సీఎం ప్రస్తావించి.. వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడంతో హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ప్రధానంగా భద్రాచలానికి ఇరువైపులా కరకట్టను నిర్మించడంతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీరుస్తామనడంతో ఆదివాసీల్లో ఆనందం వెల్లివిరిసింది. వరద కష్టాలు ఈ ప్రాంతంలో తాను కళ్లారా చూశానని, వరద ముంపు నుంచి ప్రజలను కాపాడతామని ఇచ్చిన హామీకి పెద్ద ఎత్తున స్పందన లభించింది.