కూసుమంచి, సెప్టెంబర్ 14 : తెలంగాణ రా్రష్ట్రంలోనే మొట్టమొదటి మత్స్య పాలిటెక్నిక్ కళాశాలను కూసుమంచి నియోజకవర్గంలోని పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం పరిధి జుఝల్రావుపేట గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కళాశాలను మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐదు సంవత్సరాలుగా కళాశాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరైంది. ఇప్పటివరకు ఏపీలో మాత్రమే ఉన్న మత్స్య కళాశాల తొలిసారిగా పాలేరుకు రావడం పట్ల జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూసుమంచి మండలంలోని రాజుపేట, జుఝల్రావుపేట, నాయకన్‌గూడెం తదితర ప్రాంతాల్లో కళాశాల కోసం స్థలాన్ని పరిశీలించగా జుఝల్రావుపేటలోని 356 సర్వే నంబర్లో 10ఎకరాల భూమిని గుర్తించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, తహసీల్దార్ మీనన్ ఆ స్థలాన్ని పరిశీలించారు. ఎన్ఎస్పీ పరిధిలోని స్థలాన్ని మత్స్యశాఖకు అప్పగించినట్లు డీఈ బాణాల రమేశ్‌రెడ్డి తెలిపారు. మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలో 20 సీట్లు కేటాయించారు. 10వ తరగతి అనంతరం పాలిసెట్ ద్వారా సీట్లను భర్తీ చేస్తారు.
కళాశాలకు స్థలం కేటాయింపు
కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 14 : మండలంలోని జుఝల్రావుపేట రెవెన్యూ శివారులోని 365 సర్వే నంబర్లో గల నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అధికారుల ఆధీనంలో ఉన్న 10 ఎకరాల స్థలాన్ని ఫిషరీష్ శాఖకు కేటాంచారు. మూడేళ్ల క్రితం మండలంలో పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, పాలేరు ఫిషరీష్ రీసెర్చ్ కేంద్రం అధికారులు కళాశాల మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే కందాళ కృషితో కళాశాల మంజూరైంది. దీనిస్థలం కోసం ఏడాది క్రితమే ఎన్నెస్పీ అధికారులు జుఝల్రావుపేట రెవెన్యూ పరిధిలోని భూమిని పరిశీలించి, అప్పగించడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. స్థలాన్ని పరిశీలించిన వారిలో ఎన్ఎస్పీ డీఈఈ రమేశ్‌రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగమూర్తి, ఫిషరీష్ రీసెర్స్ సెంటర్ అధికారి విద్యాసాగర్‌రెడ్డి, జుఝల్రావుపేట సర్పంచ్ మందడి పద్మ ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని మొదటి ఫిషరీష్ పాలిటెక్నిక్ కళాశాల అవుతుందని, కళాశాల మంజూరు కోసం కృషిచేసిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, మండల టీఆర్ఎస్ నాయకులు వేములు వీరయ్య, ఆసిఫ్‌పాషా, చాట్ల పరశురామ్ కృతజ్ఞతలు తెలిపారు.
కళాశాల మంజూరు హర్షణీయం
రాష్ట్రంలోనే మొట్టమొదటి మత్స్య పాలిటెక్నిక్ కళాశాల పాలేరు నియోజకవర్గంలో మంజూరు కావడం చాలా సంతోషం. సాంకేతిక విద్యాపరంగా విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యా, ఉపాధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన ప్రభుత్వం పాలేరులో మత్స్య కళాశాలను ఏర్పాటు చేసింది. కళాశాల నిర్మాణం కోసం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తాం.
– కందాళ ఉపేందర్‌రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే
శుభ పరిణామం
పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం పరిధిలో మత్స్య పాలిటెక్నిక్ కళాశాల మంజూరు కావడం శుభ పరిణామం. 10వ తరగతి అనంతరం ఎంట్రన్స్ మెరిట్ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. రాష్ట్రంలో మొదటి పాలిటెక్నిక్ కళాశాల పాలేరు పరిధిలో ఏర్పాటు కావడం చాలా ఆనందంగా ఉంది.
– డాక్టర్ విద్యాసాగర్‌రెడ్డి, మత్స్యశాఖ సీనియర్ సైంటిస్టు