అశ్వారావుపేట, అక్టోబర్ 7: స్థానిక సంస్థల ఎన్నికలపై ఆశావహులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ ఆశావహులు టెన్షన్ పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించనా కొందరు కోర్టు మెట్లు ఎక్కడంతో అనిశ్చితి కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టు బుధవారం ఏ తీర్పు ఇస్తుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
కోర్టు తీర్పుపైనే ఎన్నిక భవితవ్యం ఉంటుందనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అధికారులు మాత్రం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 22 జడ్పీటీసీ స్థానాలు, 233 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. వీటితోపాటు 471 గ్రామ పంచాయతీలకు కూడా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
కోర్టు తీర్పుపైనే దృష్టి..
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఆశావహులంతా దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దాఖలైన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. దీంతో ఆశావహులతోపాటు రాజకీయ పార్టీల నేతల్లోనూ ఉత్కంఠ కొనసాగుతుంది.
ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే షెడ్యూల్ ప్రకటించినా పిటిషన్లపై విచారణ కొనసాగిస్తామని కోర్టు అప్పుడే స్పష్టం చేసింది. పెంచిన రిజర్వేషన్లకు ఇప్పడు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? లేక అభ్యంతరం చెపుతుందా? అనే అంశం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఖర్చుకు వెనుకడుగు..
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆశావహులు ఖర్చు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల జరగకపోతే పెట్టిన ఖర్చంతా వృథా అవుతుందని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లతో స్థానాలు కోల్పోయిన ఓసీ వర్గాలు సైతం తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు నుంచి అభ్యంతరం వ్యక్తమైతే మొత్తం రిజర్వేషన్లు మారిపోతాయన్న భావనను వారు వెలిబుచ్చుతున్నారు. బీసీ స్థానాలు ఓసీలకే కేటాయించబడతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు ఓటర్లకు కొందరు ఆశావహులు ముఖం చాటేస్తున్నారు. మిగతా ఏజెన్సీ స్థానాల్లో ఇప్పటికే కొందరు ఆశావహులు పార్టీ కార్యకర్తలకు మందు, విందు కోసం ఖర్చు మొదలుపెట్టారు.