ఖమ్మం అర్బన్, డిసెంబర్ 18 : జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌ను జిల్లా సైన్స్ అధికారి(డీఎస్వో) లేకుండానే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 20, 21 తేదీలలో రెండు రోజులపాటు జరుగనున్న సైన్స్ ఫెయిర్‌లో కమిటీలకు వారధిగా వ్యవహరిస్తూ.. సైన్స్ ఆఫీసర్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అలాంటిది ఈసారి సైన్స్ ఫెయిర్‌కు ‘సర్’ లేకుండానే విద్యాశాఖ ముందుకు వెళ్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి 2023 వరకు డీఎస్వోగా సైదులు వ్యవహరించగా.. తర్వాత ఆయన హెచ్ఎం పదోన్నతిపై వెళ్లారు. తర్వాత డీఎస్వోగా నియమితులైన జగదీశ్ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండగా.. ఇటీవల డీఎస్వోని నియమించి ఆ డిప్యూటేషన్‌ను సైతం రద్దు చేశారు. దీంతో తొలిసారి డీఎస్వో లేకుండానే సైన్స్ ఫెయిర్‌కు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 20, 21వ తేదీలలో ఎస్ఎఫ్ఎస్లో జరిగే సైన్స్ ఫెయిర్‌కు 210 మందితో ఇప్పటికే 17 కమిటీలను ఏర్పాటు చేశారు.
సమన్వయం చేస్తున్న డీఈవో
సైన్స్‌పై ఆసక్తి పెంచుకుంటూ.. సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనల వైపు విద్యార్థులను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలు సాగనుండగా.. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యతను ఈసారి జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ తీసుకున్నారు. పదిహేను రోజులుగా పంచాయతీ ఎన్నికలకు నోడల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తూనే.. సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఉపాధ్యాయులను, అధికారులను సన్నద్ధం చేస్తున్నారు. సెక్టోరల్ అధికారులతో కార్యక్రమంపై రూపకల్పన చేస్తూ, అనుభవం ఉన్న వారిని కమిటీలలో నియమించి, సన్నాహక సమావేశాలతో సమన్వయం చేస్తూ పలు సూచనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో నగరంలోని ఎస్ఎఫ్ఎస్లో ఈ నెల 20, 21వ తేదీలలో జరిగే సైన్స్ ఫెయిర్‌కు హాజరయ్యే సుమారు 1,500 మందికి భోజనాలు సమకూర్చేలా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సహకారం కోరారు. ఇప్పటికే రెండు దఫాలుగా కమిటీ కన్వీనర్లతో సన్నాహక సమావేశాలు నిర్వహించగా.. శుక్రవారం కమిటీ సభ్యులందరితో మరోసారి సమావేశం నిర్వహించబోతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రమే సైన్స్ ఫెయిర్‌కు శనివారం హాజరయ్యేలా, రెండో రోజు ఆదివారం ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.
సీసీఎల్ ఇవ్వాలంటున్న సంఘాలు
పదిహేను రోజులుగా ఉపాధ్యాయులు పంచాయతీ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 18వ తేదీ సైన్స్ ప్రదర్శనల రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ కాగా.. మూడో విడత ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు 18వ తేదీ ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించారు. టీచర్లు ఎన్నికల విధుల్లో ఉండడంతో పదిహేను రోజులుగా చాలా పాఠశాలల్లో టీచర్లు లేని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న భోజనానికి సైతం చాలాచోట్ల అంగన్వాడీ, ఇతర సిబ్బందిని కేటాయించి నిర్వహణ కొనసాగించారు.
ఈ నేపథ్యంలో చాలా పాఠశాలల్లో సైన్స్ ప్రదర్శనల రూపకల్పనకు పూర్తిస్థాయి సమయం కేటాయించలేకపోయామని సైన్స్ టీచర్లు పేర్కొంటున్నారు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ఈ నెల చివరిలో ఉండేలా షెడ్యూల్ రావడంతో అనివార్యంగా ఈ నెల 20, 21వ తేదీల్లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దీంతో 21న ఆదివారం సైన్స్ ఫెయిర్‌కు హాజరయ్యే ఉపాధ్యాయులకు సీసీఎల్ (వేతనంతో కూడిన సెలవు) ఇవ్వాలని, గతంలో ఇచ్చారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.