ఖమ్మం రూరల్, జనవరి 29: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత పరిపాలనను పక్కనబెట్టి రాజకీయ క్షక్ష సాధింపులకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు. ఆ పార్టీ ఉడత ఊపులకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. జిల్లా జైల్లో ఉన్న బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును తాతా మధు సహా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సోమవారం ములాఖత్ ద్వారా కలిశారు. ఈ సందర్భంగా అతడిని పరామర్శించి జరిగిన ఘటన గురించి, అనంతరం దారితీసిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. జైలు బయటకు వచ్చిన తరువాత పార్టీ ముఖ్య నాయకులతో కలిసి తాతా మధు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు కక్షసాధింపులకు పాల్పడుతున్నారని, అదే టార్గెట్తో బీఆర్ఎస్ నాయకులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ అని, ఏళ్ల తరబడి పోరాటం చేసిన ఘనత తమ పార్టీకి ఉందని గుర్తుచేశారు.
గతంతో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తాము కక్షసాధింపులకు పాల్పడుతున్నామంటూ అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఆరోపించేవారని అన్నారు. మరి అలా అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేస్తున్నది ఏంటని ప్రశ్నించారు. ఇందుకు జిల్లాలోని ముగ్గురు మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్కు రాబోయే రోజుల్లో ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు భయపడేదిలేదని అన్నారు. ఉద్యమాలకు పుట్టినిల్లయిన బీఆర్ఎస్.. ఏనాడూ అవకాశవాద రాజకీయాలు చేయలేదని అన్నారు. పగడాల నాగరాజు అరెస్టుతో ఏమో చేస్తామని అనుకోవడం హాస్యాస్పదమేనని అన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లాలో చేస్తున్న అవకాశవాద రాజకీయాలను కొద్దిరోజుల్లోనే జిల్లా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, బీఆర్ఎస్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు గుండాల (ఆర్జేసీ) కృష్ణ, కూరాకుల వలరాజు, వీరూనాయక్, బెల్లం వేణుగోపాల్, బీ.నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.