మధిర, ఆగస్టు 08 : కమ్యూనిస్టు పోరాట యోధుడు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొల్లోజు అయోధ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం మడుపల్లి సీపీఐ కార్యాలయం అజయ్ భవనంలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. బొల్లోజు అయోధ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో పార్టీ మండల కార్యదర్శి ఊట్ల కొండలరావు మాట్లాడుతూ.. బొల్లోజు అయోధ్య మరణంతో కమ్యూనిస్టు పార్టీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన పోరాటాలు శ్లాఘనీయమన్నారు. అనంతరం మడుపల్లికి చెందిన వేల్పుల కొండ 23వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంగా శేషగిరిరావు, జల్లా బ్రహ్మం, తలారి రమేశ్, కొండూరి నాగేశ్వరరావు, అన్నవరపు సత్యనారాయణ, ఊట్ల రామకృష్ణ, సీపీఐ మడుపల్లి గ్రామ శాఖ కార్యకర్తలు పాల్గొన్నారు.