మామిళ్లగూడెం, ఏప్రిల్ 30:ఖమ్మం మున్నేరు నదిపై చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణను పూర్తి చేయడం పట్ల అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో గురువారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, కాల్వొడ్డు తీగల వంతెన పనులు, మున్నేరు భూ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న లే అవుట్ వెంచర్ పురోగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మున్నేరు నదిపై ఉన్న రాజీవ్ గృహకల్ప, రంగనాయకుల గుట్ట, ప్రకాశ్‌నగర్ చెక్ డ్యాంలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిపుణుల కమిటీ చేసిన డిజైన్ల ప్రకారం మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం పక్కాగా జరగాలని, పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద సేకరించిన భూములను అభివృద్ధి చేసి మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్వాసితులకు అందించేలా రైతులతో చర్చలు జరపాలని సూచించారు.
రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తికి రెండు వైపులా పనులు వేగంగా జరగాలన్నారు. బైపాస్ నుంచి తీగల వంతెన వరకు మున్నేరు రిటైనింగ్ వాల్ ఎడమ, కుడి వైపుల పనులు పూర్తి చేయాలన్నారు. చిన్న చిన్న గ్యాప్‌లు కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఇంకా అవసరమైన భూ సేకరణను ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్నారు.
నిర్వాసితులకు ఇచ్చే వెంచర్లో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, మున్నేరుపై నిర్మించే కేబుల్ బ్రిడ్జి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, నిర్ణీత గడువులోపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్మాణ పనులు వేగంగా చేయాలని తెలిపారు. తీగల వంతెన నిర్మాణం వల్ల ఎవరూ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, వివిధ శాఖల అధికారులు యాకూబ్, రమేశ్‌రెడ్డి, పుష్పలత, వాణి, శ్రీనివాస్, జయచందర్, వినయేందర్‌రెడ్డి పాల్గొన్నారు.