కారేపల్లి, జులై 23 : విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చిన రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా విద్యాసంస్థల బంద్ బుధవారం సింగరేణి మండల వ్యాప్తంగా సంపూర్ణంగా జరిగింది. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు స్వచ్ఛంద బంద్‌ను పాటించాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు చిలుముల భరత్, డివైఎఫ్ఐ నాయకులు ఆదర్ల వినయ్ మాట్లాడుతూ బడ్జెట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగానికి కేటాయించాల్సిన 10 శాతం కేంద్ర ప్రభుత్వం, 30% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా పాలకులవి పేరు గొప్ప ఊరు దిబ్బలాగా వ్యవహార శైలి ఉందని ఎద్దేవ చేశారు.
అందుకే విద్యారంగం ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లాగానే ఉన్నదని వారు విమర్శించారు. వేల ఉద్యోగాలు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం కోట్ల కొలువులు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఎన్ని చెప్పినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విమర్శించారు. ఎంఈఓ, డిఈఓ పోస్టులు ఖాళీగా ఉండటం వలన విద్యారంగం, విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే పాలకులు మిన్నకుం టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు కిరణ్, సంపత్, ఏఐఎస్ ఎఫ్ నాయకులు సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.