పెనుబల్లి, జూన్ 11 : నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తల్లిదండ్రులకు సూచించారు. కల్లూరు మండలం ఓబుల్రావుబంజర గ్రామంలో గతంలో మూతబడిన ప్రాథమిక పాఠశాలను గ్రామస్తులు, తల్లిదండ్రుల సమక్షంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి కలెక్టర్ బుధవారం పునఃప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. జిల్లాలో 1,500 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వీటిలో మూతబడిన పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోపాటు వాటి పునరుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు. గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 96 శాతం ఉత్తీర్ణత సాధించారని, ప్రైవేటు కంటే మెరుగ్గా ఫలితాలను ప్రభుత్వ పాఠశాలలు సాధిస్తున్నాయని గుర్తు చేశారు. అనంతరం కల్లూరు మండలంలో పునఃప్రారంభమైన పాయాపూర్, లక్ష్మీపురం, ఓబుల్రావుబంజర పాఠశాలల రినోవేషన్ కోసం రూ.10 లక్షల చెక్కును కలెక్టర్.. ఆర్డీవోకు అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లలకు స్కూల్ యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ చేశారు. తర్వాత అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్.. విద్యార్థులు ఎంత మంది వస్తున్నారని ఆరా తీశారు. పిల్లల ఎత్తు, బరువు, వయసుకు తగ్గట్టు ఉందో లేదో నిరంతరం పరిశీలన చేసుకోవాలని, కేంద్రానికి కావాల్సిన సౌకర్యాలపై ప్రతిపాదనలు అందించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో ఎస్.సత్యనారాయణ, ఆర్డీవో ఎల్.రాజేందర్, ఎంపీడీవో, ఎంఈవో పి.నివేదిత, సీడీపీవో సీహెచ్.నిర్మలాజ్యోతి, సూపర్వైజర్ సుజాత, అంగన్వాడీ టీచర్ ఐ.వరలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.