దాడిని ఖండించిన బీఆర్ఎస్ శ్రేణులు
అశ్వారావుపేట, అక్టోబర్ 1: పాలన చేతగాని కాంగ్రెస్ నేతలు.. నిత్యం ప్రజల్లో ఉండే మాజీ మంత్రి కేటీఆర్‌పై దాడి దాడి చేడం హేయమైన చర్య అని మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాశ్‌రావు, నాయకులు కాసాని చంద్రమోహన్, మందపాటి రాజమోహన్‌రెడ్డి, మోటూరి అన్నారు. కేటీఆర్‌పై దాడిని వారు తీవ్రంగా ఖండించారు. మండల కేంద్రంలో మంగళవారం వారు మాట్లాడుతూ హైదరాబాద్‌లో మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్‌పై దాడి చేయడం వారి అసమర్థతకు నిదర్శనమన్నారు. ఇందిరమ్మ రాజ్యం ముసుగులో చేస్తున్న రౌడీ పాలనను సహించేది లేదని, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ప్రజల తరఫున పోరాటాలు చేయడంతో ముందుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జె.వెంకన్నబాబు, సత్యవరపు సంపూర్ణ, నారం రాజశేఖర్, తాడేపల్లి రవి, చిన్నంశెట్టి వెంకట నరసింహం తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట రూరల్, అక్టోబర్ 1: ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారిపై దాడులు చేసి అడ్డుకోవాలనుకోవడం నీతిమాలిన చర్య అని, ప్రజా పాలన అంటే రౌడీ రాజ్యమా.. అని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రశ్నించారు. తాటిసుబ్బన్నగూడెంలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో మూసీ పరీవాహక బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ మూకలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రౌడీ రాజ్యాన్ని భరించే స్థితిలో ప్రజలు లేరని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేకనే ప్రతిపక్ష నేతలపై దాడులకకు పాల్పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో సహనంతో కాంగ్రెస్ విధ్వంస కాండను చూస్తున్నారని, సహనం కోల్పోతే కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని గ్యారెంటీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మధిర, అక్టోబర్ 1: హైదరాబాద్‌లో హైడ్రా బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ గూండాల దాడి పిరికిపంద చర్య అని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు పాల్పడడం మంచి సంస్కృతి కాదన్నారు. ప్రజా సమస్యలు తెలుపుకునేందుకు.. నిత్యం ప్రజలతో మమేకమయ్యే బీఆర్ఎస్ నేతలపై మరోసారి దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ, రైతుబంధు పథకాల నుంచి తప్పించుకునేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ డ్రామాలకు తెరలేపిందని ఆయన పేర్కొన్నారు.