బోనకల్లు, ఏప్రిల్ 30 : నిబంధనల పేరుతో కాంగ్రెస్ సర్కారు కాలయాపన చేస్తుండడంతో ఖమ్మం జిల్లాలోని మొకజొన్న రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా యాసంగిలో సుమారు 1.75 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఈ మొత్తం విస్తీర్ణంలో 70 శాతాన్ని కౌలు రైతులే సాగు చేశారు. వీరు పండించిన పంటను కొనుగోలు చేసే ప్రక్రియలో జరుగుతున్న జాప్యం వారి పాలిట శాపంగా మారింది.
కౌలు రైతుల సమస్యలపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాలకు స్పందించిన ప్రభుత్వం.. ఏఈవోల ద్వారా ఆన్లైన్ నమోదుకు ఆదేశాలిచ్చింది. అయితే, ఇక్కడ సాంకేతిక సమస్య మొదలైంది. పట్టాదారు పాసు పుస్తకం, గుర్తింపు కార్డుల అనుసంధానంతో భూ యజమాని సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగానే రిజిస్ట్రేషన్ జరుగుతోంది. భూముల యజమానులు అందుబాటులో లేకపోవడం, సహకరించకపోవడం వంటి కారణాలతో కౌలు రైతులు అవస్థలు పడుతున్నారు.
కౌలు రైతుల వివరాలను రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ ఆమోదంలో జాప్యం కావడంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కౌలు రైతుల వివరాలను ఏఈవోలు ఆన్లైన్లో నమోదు చేసిన తరువాత.. జిల్లా వ్యవసాయ అధికారి ఫైనల్ అప్రూవల్ ఇస్తేనే కొనుగోలు కేంద్రాల్లో పంటను తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా వచ్చిన ఆన్లైన్ దరఖాస్తులను ఒకే అధికారి పరిశీలించాల్సి రావడంతో వారం రోజులకు పైగా సమయం పడుతోంది.
ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు వాతావరణ మార్పుల వల్ల కల్లాల్లోనే పంటను పెట్టుకొని ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునేందుకు అప్రూవల్ రాక, త్వరగా అమ్ముకునే మార్గంలేక అన్నదాతలు అల్లాడుతున్నారు. దీంతో చాలా మంది రైతులు విధిలేక తకువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు తమ పంటను తెగనమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఎకరాకు 26 క్వింటాళ్ల చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టడం కూడా వీరికి శాపమైంది. పండించిన మిగతా పంటను ఎకడ అమ్ముకోవాలంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆన్లైన్ కేంద్రాల వద్ద పడిగాపులు కాచినా ఫలితం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఏఈవోలు రిజిస్ట్రేషన్లు చేసిన మరుసటి రోజే అప్రూవల్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో రైతు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేసేలా నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే కష్టపడి పండించిన పంట కల్లాల్లోనే ప్రకృతి విపత్తులపాలయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కౌలు రైతులు పండించుకున్న మొకజొన్న పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. కౌలు రైతుల వివరాలను ఏఈవోలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే జిల్లా అధికారులు అప్రూవల్ ఇవ్వాలి. కౌలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి తీసుకొస్తే ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు పెట్టడం సరికాదు. అప్రూవల్ ఆలస్యమైతే కౌలు రైతులు నష్టపోతున్నారు.
– వేమూరి ప్రసాద్, రైతు సమన్వయ సమితి మండల మాజీ కన్వీనర్, బోనకల్లు
నిబంధనల పేరుతో కౌలు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. కౌలు రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే పంటల కొనుగోలుకు అనుమతిస్తే రైతులు నష్టపోయే పరిస్థితి ఉండదు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక అప్రూవల్ వచ్చేంతవరకు కౌలు రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏంటి? రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అప్రూవల్ ప్రక్రియను వేగవంతం చేయాలి.
– కాకాని శ్రీనివాసరావు, రైతు సంఘం మండల అధ్యక్షుడు, బోనకల్లు
కౌలు రైతుల పంటను కొనుగోలు చేసేందుకు రిజిస్ట్రేషన్ పేరుతో ప్రభుత్వమే జాప్యం చేస్తోంది. అనేక నిబంధనలు తెచ్చి ఇబ్బందులు పెడుతోంది. పరోక్షంగా ప్రైవేటులో అమ్ముకునేలా ప్రభుత్వమే చేస్తోంది. నేను ఆన్లైన్ చేసినప్పటికీ అప్రూవల్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సకాలంలో అప్రూవల్ రాకపోవడం వల్ల రైతులు విసుగుచెంది ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి కల్పిస్తోంది.
– తమ్మారపు లక్ష్మణ్‌రావు, కౌలు రైతు, బోనకల్లు