వైరా టౌన్, సెప్టెంబర్ 13: నియోజకవర్గ కేంద్రమైన వైరాలో వంద బెడ్ల ఆసుపత్రి కల సాకారమవుతోంది. వైరాకు వంద బెడ్ల ఆసుపత్రిని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైరాలో ఈ ఆసుపత్రి నిర్మించాలని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ గతంలోనే ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణం కోసం రూ.37.50 కోట్ల నిధులను మంజూరు చేసింది.
ఈ ఉత్తర్వుల కాపీని హైదరాబాద్‌లోని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తన క్యాంపు కార్యాలయంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వైరాకు వంద బెడ్ల ఆసుపత్రి మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే రాములునాయక్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు రాములునాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.