మన్యంలో ప్రగతి వికసిస్తున్నది. పూర్తి ఏజెన్సీ నియోజక వర్గమైన పినపాకలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సాధారణ నిధులతోపాటు రూ.300 కోట్లకు పైగా ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో పనులు జోరుగా సాగుతుండడంతో నియోజకవర్గం కొత్తగా దర్శనమిస్తున్నది. ఈ ప్రాంతవాసులకు గిరిజన భవన్, డిజిటల్ లైబ్రరీ మణిహారంగా నిలుస్తుండగా..
మణుగూరులో రూ.4.70 కోట్లతో నిర్మిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలతో మెరుగైన విద్య అందనున్నది. రూ.8.10 కోట్లతో నిర్మాణాలు పూర్తికావొస్తున్న పంచాయతీ భవనాలు, పీహెచ్సీ సబ్సెంటర్లతో పాలన దగ్గరకాగా.. వైద్యం చేరువైంది. ఇక వందల కోట్లతో బీటీ, సీసీ రోడ్లు, వంతెన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏజెన్సీ అభివృద్ధిపై సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రత్యేక దృష్టి సారించ డంతో గిరి‘జనం’ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– సారపాక, అక్టోబర్ 3
సారపాక, అక్టోబర్ 3 : గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించి వారిని అభివృద్ధి పర్చడానికి తెలంగాణ ప్రభుత్వం 2017లో ఎస్టీ ప్రత్యేక ప్రగతినిధి చట్టం బిల్లును తీసుకొచ్చింది. అందులో భాగంగా ప్రతి ఏడాది గిరిజనుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తోంది. గిరిజన తండాలు, గూడేలను నూతన పంచాయతీలుగా మారుస్తూ 2018, మార్చి 28న ప్రభుత్వం ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా రూ.1,177 కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నది.
ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే తెలంగాణలో ప్రథమంగా నిలిచింది. ఏజెన్సీ నియోజకవర్గమైన పినపాక అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. సాధారణ నిధులే కాకుండా ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పెద్దఎత్తున విడుదల కావడంతో నియోజకవర్గంలోని ఏడు మండలాలు మౌలిక సదుపాయాల కల్పనలో ముందున్నాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక దృష్టి సారించి పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
మణుగూరుకు మణిహారం గిరిజన భవన్, డిజిటల్ లైబ్రరీ ఆదివాసీలు ఎక్కువగా నివసించే నియోజకవర్గ కేంద్రమైన మణుగూరులో ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో ఆదివాసీ బంజారా భవన్‌ను ఏర్పాటు చేశారు. అదే స్ఫూర్తితో నియోజకవర్గ కేంద్రాల్లో సైతం ఈ భవనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో మణుగూరులో రూ.1.10 కోట్లతో ఆదివాసీ గిరిజన భవన్‌ను నిర్మించారు. ఆదివాసీలు సమావేశాలు, వివాహాది శుభకార్యాలు జరుపుకోవడానికి ఈ భవనాన్ని వినియోగిస్తున్నారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయలేని చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రంభీం జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. గిరిజనుల పట్ల ఎంతో ప్రేమ చూపుతున్న సీఎం కేసీఆర్ వారికి బాసటగా ఉంటూ ఆత్మగౌరవ భవనాలు నిర్మించారు. మణుగూరులో ఈ భవనం ఏర్పాటుతో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అన్నివిధాలుగా సౌకర్యవంతంగా మారింది. గిరిజనులకు గుర్తింపు తెచ్చిన సీఎం కేసీఆర్‌తోపాటు మన్యం ముద్దుబిడ్డ రేగా కాంతారావును సైతం ఈ ప్రాంత గిరిజనులు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు.
యువత, విద్యార్థులు, నిరుద్యోగుల కోసం పట్టణంలో రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ త్వరలో అందుబాటులోకి రానున్నది. వేలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు, యువత వివిధ పోటీ పరీక్షలు, ఉద్యోగాలకు సిద్ధమయ్యేందుకు వీలుగా అన్ని హంగులతో లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నారు. పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు, వివిధ వార్తాపత్రికలు అందుబాటులోకి వస్తే లైబ్రరీ వరంగా మారనున్నది.
రూ.8.10 కోట్లతో పంచాయతీ భవనాలు,పీహెచ్సీ సబ్‌సెంటర్లు
నియోజకవర్గంలో ఏర్పడిన కొత్త పంచాయతీల్లో 30 భవనాలు నిర్మిస్తున్నారు. ఒక్కో పంచాయతీ భవనానికి రూ.20 లక్షల చొప్పున రూ.6 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నారు. 14 సబ్సెంటర్లను కూడా మంజూరు చేసి ఒక్కో సబ్సెంటర్కు రూ.14 లక్షల నుంచి రూ.16 లక్షల చొప్పున రూ.2.10 కోట్లను ఖర్చు చేసి నిర్మాణాలు పూర్తి చేశారు. దీంతో గ్రామాల్లో ప్రజలకు పాలన దగ్గరైంది.. వైద్యం చెంతకు చేరింది. బూర్గంపహాడ్ మండలం తాళ్లగొమ్మూరులో పంచాయతీ భవనం పూర్తవగా.. గుండాల మండలం కాచనపల్లిలో పంచాయతీ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ రేగా ఇటీవల ప్రారంభించారు.
వందల కోట్లతో బీటీ, సీసీ రోడ్లు
నియోజకవర్గంలో రహదారులను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వందల కోట్ల నిధులు మంజూరు చేస్తుండడంతో బీటీ, సీసీ రోడ్లు, వంతెనల నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. మణుగూరు, కరకగూడెం, అశ్వాపురం, పినపాక, బూర్గంపహాడ్ మండలాల్లో ఈ పనులు జోరుగా సాగుతుండగా.. తాజాగా ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో బీటీ రోడ్లకు ప్రభుత్వ విప్ రేగా శంకుస్థాపన చేశారు. గ్రామాల్లోని అంతర్గత రహదారులు సీసీ రోడ్లుగా మారుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది. మణుగూరులో రూ.4.70 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను నిర్మించారు. దీంట్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7.70 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో డార్మెటరీ హాల్, స్టాఫ్ క్వార్టర్లు, ప్రహరీ, వాటర్‌ట్యాంక్, టాయిలెట్స్ తదితర వాటిని నిర్మిస్తున్నారు. రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా ఈ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య అందనున్నది.
నియోజకవర్గ అభివృద్ధిపై రేగా ప్రత్యేక దృష్టి
పినపాక నియోజకవర్గంపై ఎమ్మెల్యే రేగా ప్రత్యేక దృష్టి సారించారు. మన్యాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎస్టీ సబ్‌ప్లాన్ కింద వందల కోట్ల నిధులు తెస్తున్నారు. మండల కేంద్రాలు, గ్రామాలు, తండాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. మణుగూరు రెసిడెన్షియల్ పాఠశాలకు రూ.కోట్ల నిధులు తీసుకొచ్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. మణుగూరులో గిరిజనుల ఆత్మగౌరవ భవనం నిర్మించారు. ప్రధానంగా ఏజెన్సీ యువత, విద్యార్థులు, నిరుద్యోగుల కోసం నిర్మిస్తున్న డిజిటల్ లైబ్రరీ త్వరలో అందుబాటులోకి రానున్నది. మణుగూరు మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి.
నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా..
పినపాక నియోజకవర్గానికి ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.300 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. ఈ నిధులను నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో అన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనాలు, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాళ్లు, పీహెచ్సీ సబ్‌సెంటర్లు, నూతన పంచాయతీ భవనాలు, బీటీ, సీసీ రోడ్లు, వాగులపై వంతెనల కోసం కేటాయించాం. గ్రామాల్లో అంతర్గత రహదారులను నిర్మిస్తున్నాం. గత ప్రభుత్వాలు ఏజెన్సీని పట్టించుకోలేదు.. సీఎం కేసీఆర్ పాలనలో ఈ ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతున్నది. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కేటాయించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
గిరిజనులకు వరం ఆదివాసీ భవన్
పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలో గిరిజన ఆదివాసీ భవన్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత గిరిజనులకు వరం. గిరిజనుల వివాహాది శుభకార్యాలు, సమావేశాలతోపాటు ఇతర వర్గాలకు కూడా ఈ గిరిజన భవన్ ఉపయోగపడుతున్నది. మణుగూరులో ఈ భవన్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వ విప్ రేగా, సీఎం కేసీఆర్‌కు గిరిజనులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు.
– పోలెబోయిన అనిల్‌కుమార్, ఆదివాసీ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షుడు, మణుగూరు
పంచాయతీ ఏర్పాటుతో పాలన దగ్గరైంది
గతంలో పంచాయతీగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం. సీఎం కేసీఆర్ ప్రతి 500 మంది ప్రజలకు పంచాయతీని ఏర్పాటు చేయడంతో మా గ్రామం నూతన పంచాయతీగా ఏర్పాటైంది. రూ.20 లక్షలతో పంచాయతీ కొత్త భవనాన్ని నిర్మించుకున్నాం. త్వరలో ఆ భవనం నుంచి కార్యకలాపాలు సాగిస్తాం. నిధులు తెచ్చిన ప్రభుత్వ విప్ రేగాకు ప్రత్యేక ధన్యవాదాలు.
– కొయ్యల పుల్లారావు, సర్పంచ్, తాళ్లగొమ్మూరు