కూసుమంచి, అక్టోబర్ 21: పైలేరియా బాధితులు దశాబ్దాల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి పాలకులు వారి బాగోగులను పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం పైలేరియా నిర్మూలించేందుకు కంకణం కట్టుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. భవిష్యత్తు తరాలను పైలేరియా(బోద వ్యాధి) నుంచి కాపాడేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నది. ఉచితంగా డీఈసీ మందులు పంపిణీ చేస్తున్నది. జిల్లాలోని 22 మండలాల పరిధిలోని 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటివరకు 12,91,666 మందికి మెడిసిన్ అందించింది. పైలేరియా బాధితుల సంక్షేమం కోసం ప్రభుత్వం నెలనెలా పింఛను అందజేస్తున్నది. జిల్లావ్యాప్తంగా 3,776 మంది బాధితులకు నెలనెలా రూ.2,016 చొప్పున పింఛన్ అందుతున్నది. వీరిలో వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, దివ్యాంగులు ఉన్నారు.
బాధితుల కష్టాలు ఇవీ..
మానవ శరీరంలోని కొన్ని అవయవాలకు మాత్రమే పైలేరియా సోకుతుంది. వ్యాధితో కాళ్ల వాపు వస్తుంది. వానకాలంలో క్యూలెక్స్ దోమ కుట్టడం వల్ల వుచీరియా బాంక్రై ఫై అనే సూక్ష్మజీవి ఈ వ్యాధిని కలిగిస్తుంది. బాధితులకు తరచూ జ్వరం వస్తుంది. ఆయాసం వేధిస్తుంది. వాపు ఉన్న అవయవానికి రక్త ప్రసరణ సరిగా లేక వాపు పెరుగుతూ ఉంటుంది. చర్మంపై పుండ్లు ఏర్పడతాయి. దురద పుడుతుంది. బాధితులు ఇక కూలి పనులకు వెళ్లలేరు. కుటుంబాన్ని పోషించుకోలేరు. సొంతపనులు చేసుకోవడమే ఎక్కువ.
జాగ్రత్తలు పాటించాలి..
వికారం, తలనొప్పి, మగత, ఒళ్లు నొప్పులు, దురద లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. బోదకాలు వచ్చిన వారు నిత్యం నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలి. పొడి దుస్తులు ధరించాలి. కాలిపై యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ రాయాలి.
పైలెట్ ప్రాజెక్ట్‌గా పాలేరు..
జిల్లా వ్యాప్తంగా 3,776 మంది బోదకాలు బాధితులు ఉండగా ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 1,850 మంది ఉన్నారు. దీంతో ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్‌గా పాలేరును ఎంపిక చేసింది. బోదకాలు నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. వైద్యారోగ్యశాఖ సిబ్బంది, అధికారులు బాధితులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నెల నెలా వారికి ఠంచనుగా మెడిసిన్ అందిస్తున్నారు.
పింఛనుతో ఆసరా..
నేను రెండు దశాబ్దాలుగా బోదకాలుతో బాధపడుతున్నాను. కూలి పనులకు వెళ్లలేను. ప్రస్తుతం ఏపీలోని పిడుగురాళ్ల నుంచి ముగ్గు తెచ్చి 30 గ్రామాల్లో రిక్షాపై తిరుగుతూ విక్రయిస్తాను. వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ప్రభుత్వం నెల నెలా ఇస్తున్న రూ.2,016 పింఛను మాకు ఆసరాగా నిలుస్తున్నది.
– అట్టూరి లక్ష్మారెడ్డి, పైలేరియా బాధితుడు, పాలేరు
బోద బాధ భరించలేనిది..
నేను 30 ఏళ్లుగా వ్యాధితో బాధపడుతున్నాం. పైలేరియా బాధితులకు నెల నెలా జ్వరం వస్తుంది. బాధితులు వ్యాధి బారిన పడిన నాటి నుంచి ఎన్నో బాధలు అనుభవించాలి. కూలి పనులకు వెళ్లలేం. పనిచేసుకోలేం. ప్రభుత్వం మా కోసం నెల నెలా మెడిసిన్ అందిస్తున్నది. పింఛను రూ.2,016 చొప్పున అందుతున్నది.
– బారి తులిశమ్మ, పైలేరియా బాధితురాలు, కూసుమంచి
క్రమం తప్పకుండా మందుల పంపిణీ..
పైలేరియా బాధితుల ఆరోగ్యం సం రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. బాధితులకు నెల నెలా ఠంచనుగా మెడిసిన్ పంపిణీ చేస్తున్నాం. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని అప్రమత్తం చేసి చికిత్స అందిస్తున్నాం. వ్యాధి లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– శ్రీనివాస్, కూసుమంచి పీహెచ్సీ వైద్యాధికారి