మేడారంలో తెలంగాణ కుంభమేళా మొదలైంది. లక్షలాది మంది భక్తులు వన దేవతలను దర్శించుకునేందుకు వెళ్తున్నారు. అక్కడి జాతరకు అనుసంధానంగా భద్రాద్రి జిల్లా చర్ల మండలం సుబ్బంపేట పంచాయతీ పరిధిలోని ఎదురు గుట్టల్లో సుంకు జాతర, మణుగూరు మండలం తోగ్గూడెం, లక్ష్మీదేవిపల్లి మండలంలోని గడ్డిగుట్టలోనూ సమ్మక్క- సారక్క జాతర షురూ అయింది. తోగ్గూడెం సమీపంలోని రథంగుట్ట నుంచి ఆదివాసీ పూజారులు అడవి మార్గంలో మేళతాళాల నడుమ సమ్మక్కను గురువారం గద్దెల వద్దకు చేర్చారు.
జాతరకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. వేలసంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అఖిల భారత అయ్యప్పదీక్ష ప్రచార సమితి సభ్యులు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్ మణుగూరు, వాసవీ వనితా వైభవ సభ్యులు అన్నదానం చేశారు.
మణుగూరు- ఖమ్మం ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు.
ఎదురుగుట్టల సుంకు జాతరకు గిరిజన గణాచారులు వన దేవతలను గద్దెల వద్దకు తీసుకొచ్చారు. జాతరకు వచ్చే వాహనాలతో చర్ల- వెంకటాపురం మార్గం కిక్కిరిసింది. గిరిజనులను తమ ఆరాధ్య దైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా నిర్వాహక కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రాకతో గడ్డిగుట్ట జాతర కూడా కిటకిటలాడింది.ఇల్లెందు మండలం సంజయ్‌నగర్, బొజ్జాయిగూడెంలోని సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణాలూ భక్తులతో కిటకిటలాడాయి.
– చర్ల/లక్ష్మీదేవిపల్లి/మణుగూరు టౌన్/ఇల్లెందు రూరల్, ఫిబ్రవరి 22