ఖమ్మం, జూన్ 27 : కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్లో శుక్రవారం ధర్నా నిర్వహించి.. రాస్తారోకో చేపట్టారు. దీంతో వైరా రోడ్లో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కేవీ కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం, పెన్షన్, హెల్త్ కార్డులు తదితర హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని, లేదంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.
కార్యక్రమంలో ఫోరం జిల్లా అధ్యక్షుడు పసుపులేటి నాసరయ్య, అర్వపల్లి విద్యాసాగర్, పగడాల నరేందర్, లింగనబోయిన సతీశ్, జడల వెంకటేశ్వర్లు, నెల్లూరి అచ్యుతరావు, బచ్చల పద్మాచారి, పాలకుర్తి కృష్ణ, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకుడు హాన్, సీపీఐ నాయకులు సింగ్ నరసింహారావు, మేకల శ్రీనివాస్, దేవిరెడ్డి విజయ్, గాదె లక్ష్మీనారాయణ, ఎస్కే సైదా, సీహెచ్.సీతామహాలక్ష్మి, ఫోరం జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డబోయిన వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.