బూర్గంపహాడ్, మార్చి 10 : ఆర్టిఫీఫియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు)తో బోధన విద్యార్థులకు వరంగా మారిందని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. అంజనాపురం ఎంపీపీఎస్‌లో ఆర్టిఫీఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో బోధనా తరగతులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన మరింత ఆకర్షణీయంగా, ఇంట్రాక్టివ్గా నిర్వహించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మెరుగ్గా సహకరిస్తుందన్నారు.
అనంతరం కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటిస్తూ చిన్నారులకు ఉత్సాహమే ప్రేరణగా ఆధారిత విద్యా బోధనను జిల్లాలో ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీ విద్యార్థి కంప్యూట్ ల్యాబ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంజనాపురం, మోరంపల్లి బంజర్, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, సారపాక గాంధీనగర్ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అనంతరం బూర్గంపహాడ్ ఆశ్రమ పాఠశాల, కళాశాలను తనిఖీ చేశారు.
తరగతి గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్, పాఠశాల ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ విద్యా బోధన, మెనూ అమలుపై ఆరా తీశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించి నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మోరంపల్లి బంజర్‌లో నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి వేపలగడ్డలో భూమిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ రాంనరేష్, ఎంఈవో యదుసింహరాజు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.