ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 18 : ఉద్యోగోన్నతి అనేది ప్రతి ఉద్యోగి కల.. ఉద్యోగోన్నతి పొందే సమయం కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు.. అలాంటి సమయం కోసం కొన్ని సంవత్సరాలుగా విద్యాశాఖ పరిధిలోని పండితులు, పీఈటీలు పడిగాపులు కాస్తున్నారు.. 2023 సంవత్సరంలో అప్పటి సీఎం కేసీఆర్ కరుణించి పోస్టులను అప్గ్రేడ్ చేసేందుకు జీవోలను విడుదల చేశారు. కానీ అమలులోకి వచ్చేసరికి రోజురోజుకు ప్రక్రియ ఆలస్యమవ్వడంతో ఉపాధ్యాయుల్లో నిరుత్సాహం వస్తున్నది. అప్గ్రేడ్ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రక్రియలో భాగంగా మల్టీజోన్-1 పరిధిలోని ఉద్యోగోన్నతులు, బదిలీల షెడ్యూల్ను ఈ నెల 18వ తేదీ వరకు ముగిస్తానని పేర్కొంది. కానీ వాస్తవంలో నేటివరకు ఉద్యోగోన్నతుల ప్రక్రియ ముగియలేదు, బదిలీల ప్రక్రియ ప్రారంభంకాలేదు.
ఉద్యోగోన్నతులు పొందే లాంగ్వేజ్ పండిట్ తెలుగు, హిందీ, పీఈటీ ఉపాధ్యాయులు ఈ నెల 13వ తేదీన వెబ్ ఆప్షన్స్కి అవకాశం కల్పించారు. సాంకేతిక కారణాలంటూ ప్రక్రియను నిలుపుదల చేస్తూ మళ్లీ వెబ్ ఆప్షన్స్కి ఈ నెల 15, 16వ తేదీల్లో అవకాశం ఇచ్చారు. ఉపాధ్యాయులు విద్యాశాఖ కల్పించిన అవకాశం మేరకు ఉద్యోగోన్నతులు పొందే క్రమంలో సీనియార్టీ ప్రకారం ఖాళీల జాబితాపై కుస్తీ పట్టి ఆప్షన్స్ ఎంపిక చేసుకున్నారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం అలాట్మెంట్ రావాలి. జిల్లాలో ఉద్యోగోన్నతులు పొందే ఉపాధ్యాయులు సోమవారం ఉదయం నుంచే తమ వ్యాపాకాలన్నింటిని పక్కనపెట్టి అలాట్మెంట్ ఎప్పుడు వస్తుందా అనే దానిలో మునిగిపోయారు. సోమవారం బక్రీద్ సెలవుదినం అయినప్పటికీ రోజు పాఠశాలకు వెళ్లిన దానికంటే ఎక్కువగా అలాట్మెంట్ కోసం ఎదురుచూసి రాత్రికి కూడా రాకపోవడంతో అలసిపోయి నిట్టూర్చారు. మంగళవారమైనా వస్తాయని ఉదయం నుంచి అదే పనిలో తోటి ఉపాధ్యాయులకు ఫోన్లు చేసి ఇంకెప్పుడు వస్తాయి అలాట్మెంట్లు అని అడగడమే కనిపించింది. ఉపాధ్యాయ సంఘాల నుంచి అధికారుల వరకు ఆలస్యానికి గల కారణాలను ఎవ్వరిని అడిగినా ఇంకో గంటలో వస్తాయని చెప్పడంతో నిరుత్సాహపడ్డారు.
ఉద్యోగోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలలో రిలీవింగ్ ఇచ్చేందుకు రిలీవింగ్ లెటర్లను కూడా రాసి రెడీగా ఉంచుకున్నారు. వెబ్ ఆప్షన్స్ ద్వారా అలాట్ అయ్యే స్కూల్లో జాయినింగ్ ఇచ్చేందుకు కూడా లెటర్లను సిద్ధం చేసి పెట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నానికి అలాట్మెంట్లు వస్తే మధ్యాహ్నం ఇక్కడ రిలీవ్ అయ్యి సాయంత్రానికి అలాట్ అయిన స్కూల్లో రిపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. సాయంత్రం స్కూల్ ముగిసే సమయానికి కూడా అలాట్మెంట్ రాకపోవడంతో నిరాశే మిగిలింది.