అశ్వారావుపేట, జూన్ 22 : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకుండా సర్దుబాటుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయగా జిల్లా విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయుల వివరాలతో సిద్ధంగా ఉన్నారు. బడిబాట కార్యక్రమం తర్వాత తాత్కాలిక బదిలీలు చేపట్టనున్నారు. అయితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొత్త నిబంధనలతో విద్యార్థులకు తీవ్రనష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులపైనా పని వత్తిడి మరింత పెరుగుతుందని మదనపడుతున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటుకు నిర్ణయించింది. విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలుగకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్ష సంకేతాలు ఇస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల ఖాళీల భర్తీని మరికొంతకాలం సాగదీయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అనుమానిస్తున్నాయి. ఉపాద్యాయుల కొరతను అధిగమించేలా సర్దుబాటు చేయాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మే 28వ తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సబ్జెక్ట్ నిర్దిష్ట అవసరం, పాఠశాలల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయుల సర్దుబాటు బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించింది. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలకు ఉపాధ్యాయుల సర్దుబాటు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచే లక్ష్యంతో విద్యాశాఖ బడిబాట ప్రోగ్రాం చేపట్టింది. ఉచిత విద్య, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, దుస్తుల పంపిణీ వంటి అనేక పథకాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూడైస్ ఆధారంగా ఉపాధ్యాయులు సర్దుబాటు ముందుగానే చేస్తే వచ్చే ఇబ్బందులను గుర్తించిన విద్యాశాఖాధికారులు బడిబాట కార్యక్రమం పూర్తి అయిన తర్వాతనే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలనే నిర్ణయాన్ని వాయిదా వేశారు. బడిబాట తర్వాత ఉపాధ్యాయులు ఎక్కడ అవసరమో.. ఎక్కడ మిగులు ఉన్నారో స్పష్టంగా తేలనుంది.
ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రభుత్వం నిబంధనలను పేర్కొంది. గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఒకే ప్రాంగణంలో రెండు ప్రాథమిక పాఠశాలలు లేదా ఒక ఉన్నత, ఒక ప్రాథమిక పాఠశాల ఉంటే వాటిని ఒక యూనిట్‌గా తీసుకోవాలి. అవసరాన్ని బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి. ఇంకా మిగులు ఉపాధ్యాయులు ఉంటే ఇతర అవసరమైన పాఠశాలలకు పంపించాలి. గ్రామ పంచాయతీలో అవసరం లేకుంటే మండలం యూనిట్‌గా, ఒకవేళ మండలంలో కూడా అవసరం లేకుంటే ఇతర మండలాలకు కూడా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే అవకాశం కల్పించింది.
ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను పెంచాలని సూచిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా నిర్వీర్వం చేసే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయంటూ మండిపడుతున్నారు. ఒకవేళ సర్దుబాటు చేయాలనుకుంటే పాత ఉత్తర్వుల మేరకు చేపట్టాలని కోరుతున్నాయి.
ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కంటే నిర్వీర్యమయ్యే ప్రమాదమే ఎక్కువగా ఉంది. అందుకే సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకొని ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలి. ప్రభుత్వ నిర్ణయాలు విద్య అభ్యున్నతికి దోహదపడేలా ఉండాలే గానీ నష్టంచేసేలా ఉండకూడదు.
-హలావత్ హరిబాబు, టీజీటీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అశ్వారావుపేట