బోనకల్లు, మే 09 : ప్రభుత్వం ఈ నెల 13వ తేదీ నుండి ఉపాధ్యాయులకు నిర్వహించే శిక్షణను ఎండల తీవ్రత దృష్ట్యా ఒక పూట మాత్రమే నిర్వహించాలని, అలాగే శిక్షణా కేంద్రంలో సరైన వసతులు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ శుక్రవారం విద్యాశాఖాధికారులకు విజ్ఞప్తి చేసింది. బోనకల్లులో జరిగిన కార్యకర్తల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ… ఉపాధ్యాయులకు శిక్షణలు డివిజన్ కేంద్రాల్లో కూడా నిర్వహించాలని, ఉపాధ్యాయులందరూ ఖమ్మంలోనే శిక్షణ తీసుకోవాలని చెప్పడం సరైంది కాదన్నారు. ఉపాధ్యాయుల నివాస ప్రాంతాల ఆధారంగా వారికి అందుబాటులో ఉన్న కేంద్రంలో శిక్షణకు హాజరయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటూ, ఎలాంటి అసౌకర్యం కలుగకుండా శిక్షణలు నిర్వహించే విధంగా అధికారులు చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంపు కోసం ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా బడిబాట నిర్వహించాలని పిలుపునిచ్చారు. పాఠశాలలు తెరిచేనాటికే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలన్నారు. ప్రభుత్వం, అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వల్లంకొండ రాంబాబు, జిల్లా కార్యదర్శులు గుగులోతు రామకృష్ణ, బానోత్ రాందాస్, డీఎస్ నాగేశ్వరరావు, ఉద్దండ్ షరీఫ్, బానోత్ రమేశ్, సూర్య, తులసీదాస్, గుగులోతు శారధ పాల్గొన్నారు.