భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు మొదట కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూరు శాతం ఓటరు నమోదు కార్యక్రమాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. ఓటు నమోదుపై ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించి.. నమోదు కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు.
దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లను గుర్తించి నేరుగా అధికారులే వెళ్లి ఓటు కోసం దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. అలాంటి దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోపు పరిష్కరించుకోవాలని అధికారులను ఆదేశించారు. బీఎల్వో వ్యవస్థను మరింత పటిష్ట పరిచేలా చూడాలని తహసీల్దార్లకు సూచించారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదును మరింత వేగవంతం చేయాలని, ఉపాధ్యాయులు, పట్టభద్రులు, ఇతర ప్రాంతాల్లో ఉంటే పరిశీలన చేసి వారికి అవగాహన కల్పించాలన్నారు.
ఓటరు నమోదుతోపాటు సవరణల్లో భాగంగా మార్పులు, చేర్పులు, ఓటరు గుర్తింపు కార్డుల జారీ లాంటివి ఎప్పటికప్పుడు చేపడుతూ.. ప్రజలకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటరు వివరాలు, గతంలో ఓటర్లు, నమోదు కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా.. తొలుత ఇల్లెందు అతిథి గృహానికి వచ్చిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డికి ఎస్పీ రోహిత్‌రాజు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
మామిళ్లగూడెం, డిసెంబర్ 13: ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టాలని, ప్రతి దశలోనూ పార్టీల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఓటర్ల సవరణ జాబితా-2025పై కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. జిల్లాలో ఓటర్ల సవరణ జాబితా-2025, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా నమోదుపై చేపడుతున్న చర్యలపై కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఉన్న తప్పొప్పులను సరి చేసేందుకు జాబితా సవరణ మంచి అవకాశమని, ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహిస్తే ఓటరు జాబితా సవరణ విజయవంతంగా పూర్తి చేయగలమని తెలిపారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని, వీటిలో మొత్తం 12,27,230 మంది ఓటర్లతో డ్రాఫ్ట్ తయారు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 27,287 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారని, నవంబర్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రచారంలో 1,181 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చిన 21,277 దరఖాస్తులలో ఇప్పటివరకు 18,097 పరిష్కరించామన్నారు. డిసెంబర్ 30 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీవోలు నర్సింహారావు, రాజేందర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.