Khammam | ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద సాధారణ ఎన్నికలను తలపించే విధంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రం జలగం నగర్ ఉన్నత పాఠశాలలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికారులు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.
ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 48 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల సరిహద్దులో పోటీ చేసిన అభ్యర్థుల అనుచరులు పెద్దపెద్ద టెంట్లు వేసి అభ్యర్థుల ఫ్లెక్సీలను బహిరంగంగానే ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో కనపడే విధంగా ఒక వర్గం భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. రకరకాల జెండాలను కడుతూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా అభ్యర్థుల అనుచరులు భారీ టెంట్లతో పాటు జెండాలు, అభ్యర్థుల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు ప్రదర్శించడం పలు వివాదాలకు తావిస్తోంది.