కొత్తగూడెం సింగరేణి/ రామవరం, జనవరి 27: కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయమని టీబీజీకేఎస్ నాయకులు పేర్కొన్నారు. ఇందుకోసం తమ సంఘం ఎప్పటికీ అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. టీబీజీకేఎస్ అవిర్భావ వేడుకలను సింగరేణి కార్పొరేట్, ఏరియా, ఇతర కార్యాలయాల్లో సంఘం నాయకులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణిలో కార్మిక సంఘంగా 2003లో టీబీజీకేఎస్ ఆవిర్భవించిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకూ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతూ వస్తోందని వివరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో అనేక హక్కులు సాధించుకున్నామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా సంఘం జెండాలను ఎగురవేశారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆవిర్భావ వేడుకల కేక్ కట్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సంఘం నాయకులు కాపు కృష్ణ, గడప రాజయ్య, రవికుమార్, విజయ్, వెంకటేష్, గణేష్, ఆంజనేయులు, మురళి, రామస్వామ, వెంకటస్వామి, కిరణ్, రాజ్‌కుమార్, సూరిబాబు, దొమ్మేటి నాగేశ్వరరావు, మోరె రమేశ్‌కుమార్, కరాటే శ్రీనివాస్, కిరణ్, శ్రీనివాస్, సూర్యకిరణ్, ఈవీ రావు, మురళి పాల్గొన్నారు.