ఖమ్మం, మార్చి 10 : జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌ను కోరారు. ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు కలెక్టరేట్లో సోమవారం ఎమ్మెల్సీ తాతా మధును కలిసి తమ సమస్యలు వివరించగా.. ఆయన రైతులతో కలిసి కలెక్టర్‌ను కలిసి వివరించారు.
రైతులు కూడా తమ సమస్యలను కలెక్టర్‌కు నేరుగా చెప్పుకున్నారు. దీంతో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కలెక్టర్ తాతా మధుకు హామీ ఇచ్చారు. తాతా మధు వెంట రూరల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నేలకొండపల్లి మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, రైతులు ఉన్నారు.