కారేపల్లి,జూలై 31 : ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పి మట్టి ఇతరులకు అమ్ముకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా సింగరేణి మండల తహసీల్దార్ రమేష్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కారేపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలో అనేకచోట్ల అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.
ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పి బయట మట్టిని అమ్ముకుంటున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు కూడా మట్టి తవ్వకాలు జరిపేందుకు అధికారికంగా ఎటువంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. మండలంలో ఎక్కడైనా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతే స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నట్టు తెలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు.